ఆర్టీసీలో ప్రవేశపెట్టే కార్గో సేవలను దశలవారీగా విస్తరించనున్నారు. ఇప్పటికే కొన్ని బస్సులు సిద్ధమయ్యాయి. మియాపూర్ బస్ బాడీబిల్డింగ్ యూనిట్‌లో వీటిని సిద్ధం చేస్తున్నారు. కార్గో బస్సులకు ఎర్రరంగును వేయాలని నిర్ణయించారు. జనవరి మొదటివారంలో సిద్ధమైన బస్సులతో కార్గో సర్వీసులు ప్రారంభించాలని ఆర్టీసీ ఇంఛార్జి ఎండీ సునీల్ శర్మ అధికారులను ఆదేశించారు.
తొలివిడతలో 1,209 మంది సిబ్బందితో...
కార్గో బస్సుల నిర్మాణం వేగంగా జరుగుతోంది. తొలివిడతలో 1,209 మంది సిబ్బందితో పాటు 800ల డిపోలకు సరుకు రవాణా సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. మొదటిదశలో వివిధ ప్రాంతాలు, జిల్లాల్లో ప్రైవేటు వ్యక్తుల నుంచి బుకింగ్స్ స్వీకరిస్తారు. అనంతరం ప్రభుత్వశాఖలకు విస్తరించాలని భావిస్తున్నారు. ప్రభుత్వశాఖల్లో మొదట వ్యవసాయశాఖ, పౌరసరఫరాలశాఖ వస్తువులను రవాణా చేయనున్నారు. ఆ తర్వాత విద్యాశాఖ, పరిశ్రమలశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌శాఖల వస్తు రవాణాపై దృష్టిసారించనున్నారు.
గ్రేటర్లో 600 బస్సులు తగ్గింపు...
ఈ సర్వీసుల ఏర్పాటులో ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ కీలకపాత్ర పోషించనుంది. లాజిస్టిక్ బిజినెస్ సేవల కోసం ఆర్టీసీ ఇప్పటికే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లను ఎంపికచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి డిపోకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌ను నియమించే బాధ్యతలను ప్రాంతీయ మేనేజర్ స్థాయి అధికారులు చూస్తున్నారు. గ్రేటర్ పరిధిలో ఆక్సుపెన్సీ రేషియా తక్కువగా ఉన్న రూట్లను అధ్యయనం చేసిన సంస్థ.. వేయి బస్సులు తగ్గించాలని నిర్ణయించింది. చివరకు దానిని 600 బస్సులకు పరిమితం చేసింది.