తెలంగాణ

telangana

By

Published : Feb 3, 2023, 6:08 PM IST

ETV Bharat / state

ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మీకిదే లాస్ట్‌ ఛాన్స్‌.. సీఎంకు రేవంత్‌ లేఖ

Revanth Reddy Letter to CM KCR: రాష్ట్రంలో రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని కేసీఆర్‌ సర్కారు ఇప్పటికీ నెరవేర్చలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఇదే చివరి అవకాశమని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు.. బడ్జెట్‌లో నిధుల కేటాయింపులపై ముఖ్యమంత్రికి లేఖ రాశారు.

Revanth Reddy open letter to CM KCR
Revanth Reddy open letter to CM KCR

Revanth Reddy Letter to CM KCR: కేసీఆర్‌ సర్కారు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇది చివరి అవకాశమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో వారికి ఓట్లు అడిగే హక్కు లేదని మండిపడ్డారు. ఈ మేరకు ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు.. బడ్జెట్‌లో నిధుల కేటాయింపులపై ముఖ్యమంత్రికి రేవంత్‌రెడ్డి లేఖ రాశారు.

ఈ సందర్భంగా రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేర్చలేదని రేవంత్‌రెడ్డి లేఖలో ప్రస్తావించారు. గడిచిన నాలుగేళ్లలో రెండు విడతల్లో కలిపి మొత్తం మాఫీ చేసింది కేవలం రూ.3,881 కోట్లు మాత్రమేనని తెలిపారు. ఇంకా రూ.20,857 కోట్ల మాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారని వివరించారు. దళిత సామాజిక వర్గానికి తీరని అన్యాయం చేశారని ఆరోపించిన ఆయన.. తొలి దళిత ముఖ్యమంత్రి మొదలు.. ప్రతి కుటుంబానికి మూడెకరాల భూమి వరకు ఒక్కటంటే ఒక్క హామీ నెరవేర్చలేదని తెలిపారు. ఇప్పుడు దళితబంధు పేరుతో ఆ వర్గాలను మరోసారి వంచించేందుకు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. పథకం అమలు తీరు చూస్తే ఊరికో కోడి.. ఇంటికో ఈక అన్నట్లు తయారైందని మండిపడ్డారు.

ఉద్దేశపూర్వకంగానే నీరుగార్చారు..: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నీరుగార్చినట్లు కనిపిస్తోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రూ.35,200 కోట్లతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం ప్రస్తుతం రూ.60 వేల కోట్లకు చేరిందని గుర్తు చేశారు. గత బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు కేవలం రూ.1,225 కోట్లు మాత్రమేనని.. ఇలా కేటాయింపులు చేస్తే ఈ ప్రాజెక్టు మరో 60-70 ఏళ్లకు కూడా పూర్తి కాదని పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌లో అయినా ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులు పెంచాలని డిమాండ్‌ చేశారు.

తొమ్మిదేళ్లుగా ఊరిస్తూనే ఉన్నారు..: ఈ క్రమంలోనే డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లపై గడిచిన తొమ్మిదేళ్లుగా ప్రజలను ఊరిస్తూనే ఉన్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో మంజూరు చేసిన ఇళ్లు కేవలం 2,97,057 మాత్రమేనని తెలిపారు. ఇందులో 2,28,520 నిర్మాణం మొదలవగా.. లబ్ధిదారులకు అందజేసినవి కేవలం 21 వేలు మాత్రమేనని స్పష్టం చేశారు. సొంత జాగా ఉన్న వాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం చేస్తామన్న బీఆర్‌ఎస్‌ హామీ ఏమైందని ప్రశ్నించిన రేవంత్‌.. గత బడ్జెట్‌లో ప్రకటించిన ఈ పథకానికి ఇంత వరకు మార్గదర్శకాలు లేవని, పథకాన్ని ప్రారంభించిందీ లేదని ఆక్షేపించారు.

ఆ పథకాన్నీ అటకెక్కించారు..: రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇస్తామన్న రూ.3016 నిరుద్యోగ భృతి ఏమైందని రేవంత్‌రెడ్డి లేఖలో ప్రశ్నించారు. టీఎస్‌పీఎస్సీ వద్ద సుమారు 26 లక్షల మంది నిరుద్యోగుల నమోదు జాబితా ఉంటే.. ఎవరికీ ఒక్క రూపాయి భృతి ఇచ్చింది లేదన్నారు. ఈ క్రమంలోనే పేద విద్యార్థుల కోసం కాంగ్రెస్ హయాంలో తెచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్నీ అటకెక్కించారని మండిపడ్డారు. రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తామన్న హామీ ఒక బూటకమని రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. పంట చేతికి వచ్చే సమయంలో విద్యుత్ కోతలతో అన్నదాతలు రోడ్డెక్కుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో మళ్లీ సబ్ స్టేషన్ల ముందు ధర్నాల దృశ్యాలు కనిపిస్తున్నాయన్నారు. నష్టాల భర్తీ పేరుతో గృహ వినియోగదారులపై ఏసీడీ పేరుతో అదనపు ఛార్జీల భారం మోపుతున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే వైద్యం విషయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించిన ఆయన.. కొత్త వాటి సంగతి దేవుడెరుగు.. ఉన్న ఆస్పత్రులు నిర్వహణకే నిధులు లేని పరిస్థితి నెలకొందని దుయ్యబట్టారు.

ఇవీ చూడండి..

రాష్ట్రంలో హాథ్ సే హాథ్ జోడో యాత్ర ములుగు జిల్లా నుంచే ప్రారంభం కానుంది

పెట్రోల్​ ధర రూ.2 పెంపు.. కొత్త కార్లపై మరింత ట్యాక్స్​.. రాష్ట్ర బడ్జెట్​లో సామాన్యులకు షాక్​!

ABOUT THE AUTHOR

...view details