Revanth Reddy Fired On Kcr: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై చట్టసభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలను.. సీఎం కేసీఆర్ ఎందుకు ఖండించలేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణను అవమానిస్తుంటే కేసీఆర్ బయటకు ఎందుకు రావడం లేదని నిలదీశారు. మోదీ వైఖరిని ఖండిస్తూ రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తారని అనుకున్నామని.. కానీ అలాంటిదేమీ జరగలేదని రేవంత్ అన్నారు. గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో.. కేసీఆర్ తీరుపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంపై యుద్ధం ప్రకటించామని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్... తెలంగాణ ఏర్పాటును అవమానపరిచేట్లు మోదీ మాట్లాడితే కనీసం ఖండించలేదని రేవంత్ ధ్వజమెత్తారు.
భయపడ్డారా.?
తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వాళ్లే ర్యాలీలో పాల్గొన్నారని రేవంత్ అన్నారు. మోదీకి భయపడే కేసీఆర్ కుటుంబం నిరసనల్లో పాల్గొనలేదా అని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజమంతా కదిలితే కేసీఆర్ కుటుంబం బయటకు ఎందుకు రాలేదని నిలదీశారు. తెరాస శ్రేణులు మొక్కుబడిగా నల్ల జెండాల ప్రదర్శన చేశాయని విమర్శించారు. రాష్ట్రంలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో కూడా శుభకార్యాలకు పోయినట్లు చలువ అద్దాలు పెట్టి బుల్లెట్ బండిమీద వెళ్తారా అని ప్రశ్నించారు.