'రైతుల నుంచి లాక్కుంటున్నారు.. రియల్ బిజినెస్ చేస్తున్నారు..!'
"సెజ్‌ల పేరుతో రైతుల భూములను బలవంతగా ప్రభుత్వం లాక్కొని రియల్ ఎస్టేట్ చేస్తోంది. టీఎస్ఐఐసీ ప్రభుత్వం అన్నదాతల వద్ద తీసుకున్న రెండు వేల ఇరవై ఎకరాల భూ సేకరణలో అవకతవకలు జరిగాయి. కేవలం పెద్ద కార్పొరేట్ కంపెనీల లబ్ధి కోసమే ప్రభుత్వం పంట భూములను తీసుకొంది. " -ఎల్. రమణ, తెతెదేపా అధ్యక్షుడు
సెజ్‌ల పేరుతో రైతుల భూములను బలవంతంగా లాక్కొని రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని తెలంగాణ రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు ఎల్. రమణ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందన వల్లి గ్రామ భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎల్. రమణతో పాటు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పాల్గొన్నారు. టీఎస్ఐఐసీ ( మల్టీ ప్రొడక్స్ సెజ్ కోసం) ప్రభుత్వం రైతుల వద్ద తీసుకున్న రెండు వేల ఇరవై ఎకరాల భూ సేకరణలో అవకతవకలు జరిగాయన్నారు. కేవలం బడా కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం... రైతులు పండిస్తున్న భూములను అన్యాయంగా తీసుకొంటుందన్నారు.