Radhika diamonds gold theft case arrest police: ఇటీవల హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన 7కోట్ల రూపాయాల విలువైన రాధిక డైమండ్స్ బంగారు వజ్రాభరణాల చోరీ కేసును పోలీసులు చేధించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. రాధిక డైమండ్స్‌లో రెండు నెలల క్రితమే డ్రైవర్‌గా పనిలోకి చేరిన శ్రీనివాస్ విలాసవంతమైన జీవితం గడిపేందుకు విలువైన బంగారు ఆభరణాలను దొంగతనం చేయాలని కుట్రపన్నారని డీసీపీ జోయల్ డేవిస్ పేర్కొన్నారు. మధురానగర్‌లో ఓ కస్టమర్‌కు ఇయర్ రింగ్స్ చూపించడానికి సేల్స్‌మెన్ అక్షయ్ కుమార్‌తో పాటు శ్రీనివాస్ వెళ్లారన్నారు.
అక్షయ్‌కుమార్ ఇయర్ రింగ్స్ డెలివరీ చూపించడానికి కస్టమర్ ఇంట్లోకి వెళ్లగానే డ్రైవర్ శ్రీనివాస్ అప్పటికే కారులో ఉన్న మిగతా ఏడు కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పారిపోయాడని వివరించారు. నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఆధారాలను పరిశీలించి అరెస్టు చేసినట్లు తెలిపారు.నిందితుణ్ని పట్టునేందుకు చాకచక్యంగా పని చేసిన పోలీసు సిబ్బందిని నగదు బహుమతి అందజేశారు.