ఏపీలోని కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి ఆలయంలో దసరా సందర్భంగా... కర్రల సమరాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ ఏడాది దీన్ని రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాలు జారీచేశారు. ఆలయ పరిసరాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. హింసకు దారితీసే ఈ కర్రల సమరాన్ని అరికట్టేందుకు గతంలో అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా సత్ఫలితాలు ఇవ్వలేదు. ఆఖరికి కరోనా దెబ్బకు ఈ సంప్రదాయానికి బ్రేక్ పడ్డట్టైంది.
జైత్రయాత్రగా బయల్దేరే తమ ఇలవేల్పు మాళమ్మ, మల్లేశ్వరస్వామివార్ల ఉత్సవ విగ్రహాలను చేజిక్కించుకునేందుకు ఇరువర్గాల ప్రజలు పోటీ పడుతూ జరిపే ఉత్సవాన్నే.. బన్ని ఉత్సవం అంటారు. ఇందులో భాగంగా కర్రలతో యుద్ధం చేసుకుంటారు. నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల ప్రజలు ఓ జట్టుగా.. ఆలూరు, సుళువాయి, ఎల్లార్తి, అరికెర, నిడ్రవట్టి, బిలేహాల్ గ్రామస్థులు మరో జట్టుగా తలపడతారు. అనాదిగా వస్తున్న ఈ ఆచారాన్ని తిలకించేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి లక్షల మంది తరలివస్తారు. ఈసారి వీరందరినీ దేవరగట్టుకు వెళ్లనీయకుండా రహదారులన్నీ మూసివేశారు.