తెలంగాణ

telangana

ETV Bharat / state

Governor Issue: రాజకీయ రచ్చ రేపుతోన్న గవర్నర్ వ్యవహారం - Telangana News

Governor Issue: రాష్ట్రంలో గవర్నర్‌ వ్యవహారం రాజకీయ రచ్చ రేపుతోంది. ప్రోటోకాల్‌ అంశంపై భాజపా, తెరాస నేతలు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. కుటుంబంలోని సమస్యలు తప్పించుకునేందుకు... కేసీఆర్‌ గవర్నర్‌ అంశాన్ని సాకుగా వాడుకుంటున్నారని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Governor
Governor

By

Published : Apr 8, 2022, 10:54 PM IST

Governor Issue: ప్రగతిభవన్‌, రాజ్‌భవన్‌ మధ్య ఎడబాటు... రాజకీయ రగడకు దారితీస్తోంది. తనకు కనీస గౌరవం ఇవ్వడం లేదని... ప్రోటోకాల్‌ పాటించడం లేదని సర్కారుపై గవర్నర్‌ ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన మంత్రులు... తమిళిసై పూర్తిగా భాజపా నేతలా వ్యవహరిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. గవర్నర్‌ ఎక్కడ గౌరవం దక్కలేదో చెప్పాలని ప్రశ్నించారు.

రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటున్న తనపై రాజకీయ ముద్ర వేయడం తగదని గవర్నర్‌ స్పందించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన భాజపా... సమ్మక్క సారక్క జాతర, యాదాద్రిలో గవర్నర్‌కు ప్రోటోకాల్‌ ఎందుకు పాటించలేదని ప్రశ్నించింది. బడుగు వర్గాలకు చెందిన మహిళ కాబట్టే... తెరాస గవర్నర్‌ను గౌరవించడం లేదని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌ విమర్శించారు.

గవర్నర్ తమిళిసై, భాజపా నేతల వ్యాఖ్యలపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందించారు. గవర్నర్ తమిళిసై హుందాగా వ్యవహరిస్తే ఆమెకు ఇచ్చే గౌరవం ఎప్పటికీ ఉంటుందని మంత్రి వ్యాఖ్యానించారు. యాదాద్రికి వెళ్లే 10 నిమిషాల ముందు చెబితే ప్రోటోకాల్ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. గవర్నర్‌ భాజపా నాయకురాలిగా మాట్లాడుతున్నారని మంత్రి సత్యవతి సైతం విమర్శించారు. అసెంబ్లీని రద్దు చేస్తానంటూ గవర్నర్‌ వ్యాఖ్యానించడం తగదని మంత్రులు హితవు పలికారు.

కుటుంబ సమస్యలను తప్పించుకునేందుకే కేసీఆర్... గవర్నర్ అంశాన్ని తెరపైకి తెచ్చారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం చేయాలంటూ కేటీఆర్ ఒత్తిడి తెస్తున్నారన్న రేవంత్‌... ఈ విషయంలో గవర్నర్‌ అంశాన్ని సాకుగా చూపెడుతున్నారని వివరించారు.

రాజకీయ రచ్చ రేపుతోన్న గవర్నర్ వ్యవహారం


ఇదీ చదవండి :హస్తినలో ధర్నాకు సిద్ధమవుతున్న గులాబీ దళం.. ఏర్పాట్లు ముమ్మరం..

ABOUT THE AUTHOR

...view details