TS Cyber Security Bureau Will be Launched in April: సైబర్ నేరాలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైన సైబర్ సెక్యూరిటీ బ్యూరో టీఎస్సీఎస్బీ త్వరలో అందుబాటులోకి రానుంది. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ కేంద్రంగా ఏర్పాటవుతున్న ఈ బ్యూరో ఏప్రిల్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ టీఎస్సీఎస్బీలో హెల్ప్ లైన్, రాష్ట్ర సైబర్ కంట్రోల్ రూమ్, కేంద్ర పర్యవేక్షణ విభాగం, డేటా అగ్రిగేషన్ అండ్ అనాలసిస్ యూనిట్, థ్రెట్ ఇంటలిజెన్స్ యూనిట్, ఫోరెన్సిక్ సపోర్ట్ యూనిట్ ఉంటాయి.
TS Cyber Security Bureau Udates: కేసుల దర్యాప్తు, న్యాయ విచారణకు సంబంధించి ప్రత్యేకంగా ఇన్వెస్టిగేషన్ అండ్ ప్రాసిక్యూషన్ సపోర్ట్ యూనిట్ ఇందులో ఏర్పాటు చేస్తున్నారు. వీటికి అనుబంధంగా నియామక, శిక్షణ విభాగం పనిచేస్తుంది. బ్యూరో పూర్తిస్థాయిలో ఏర్పాటయ్యాక సీఐడీ దగ్గరున్న సైబర్ నేరాల కేసులు ఇక్కడికి బదిలీ అవుతాయి. సైబర్ నేరాలకు సంబంధించి ప్రస్తుతం అన్ని జిల్లాల్లో సమన్వయ కేంద్రాలున్నాయి. ఇవి బ్యూరోకు అనుసంధానమవుతాయి.
అవగాహన కల్పిస్తూ.. అనుసంధానమయ్యేలా ఒక విభాగం: వివిధ కేసులు దర్యాప్తు తీరుతెన్నులపై ప్రాసిక్యూషన్ సపోర్ట్ విభాగం క్షేత్రస్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తుంది. క్షేత్రస్థాయి కార్యకలాపాలకు సంబంధించిన వ్యవస్థలు స్థానిక యూనిట్ అధికారుల ఆధ్వర్యంలో కొనసాగుతాయి. ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. ఎక్కువ మందితో అనుసంధానం అయ్యేలా ఒక విభాగాన్ని నెలకొల్పారు. సైబర్ భద్రత, శిక్షణలో భాగంగా భవిష్యత్తులో సైబర్ ల్యాబ్, అకాడమీ సదుపాయం రానుంది. ప్రభుత్వం ఈ బ్యూరోకు ఇటీవల 500 పోస్టులు కేటాయించింది.
డిసెంబరులో కార్యకలాపాలకు ప్రణాళిక సిద్ధం: మినిస్టీరియల్ స్టాఫ్ నియామకానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుతం 7 సంయుక్త సైబర్ క్రైమ్ సమన్వయ బృందాలు ఉన్నాయి. మహారాష్ట్ర, గోవా, జార్ఖండ్, రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు సైబర్ నేరాల్లో సమన్వయంతో పనిచేస్తూ సమచారాన్ని బదిలీ చేసుకుంటున్నాయి. టీఎస్సీఎస్బీ డిసెంబరులోగా పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. రాష్ట్రంలోని ఇతర కమిషనరేట్ల తరహాలోనే టీఎస్సీఎస్బీ ప్రభుత్వం పోలీస్ స్టేషన్ నోటిఫై చేసింది. వ్యక్తిగత సమాచార తస్కరణ, స్ఫూఫింగ్, సైబర్ దాడులు, ఫిషింగ్ వంటి సమస్యల్ని ప్రజలు, సంస్థలు ఎదుర్కొంటున్నాయి. క్రిప్టో నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇందులో అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
ఇవీ చదవండి: