ఇటీవల కాలంలో పోలీసు ఉద్యోగాల పట్ల యువతలో ఆసక్తి క్రమంగా తగ్గిపోతోంది. రాష్ట్రంలో మొత్తం 16,295 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పోలీసు నియామక మండలి ప్రకటన జారీ చేసింది. దాదాపు ఆరు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
పోలీసు ఉద్యోగాలంటే డిమాండ్ ఎక్కువ ఉండగా.. దానికి తగ్గట్టుగానే దరఖాస్తులు వచ్చాయి. వీరందరికీ రాత, దేహదారుఢ్య పరీక్షలు పూర్తయిన తర్వాత 13,690 మందిని ఎంపిక చేశారు. ఈ నెల 17న వీరికి శిక్షణ ప్రారంభమైంది. ఉద్యోగాలకు ఎంపికైన వారిలో 1,370 మంది గైర్హాజరయ్యారు. వీరిలో 500 మంది మాత్రమే తమకు ఈ ఉద్యోగం ఇష్టం లేదని లిఖితపూర్వకంగా తెలిపారు.
ఉద్యోగం నచ్చలేదని..
మిగతా వారు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా శిక్షణకు హాజరు కాలేదు. ప్రతిసారి ఇటువంటి పరిణామాలు మామూలే... అయితే ఈసారి గైర్హాజరయిన వారి సంఖ్య కొంత ఎక్కువగా ఉందని అధికారులు సరిపెట్టుకుంటున్నా... మరో కొత్త సమస్య వచ్చి పడింది. ప్రస్తుతం శిక్షణలో ఉన్నవారు కూడా ఈ ఉద్యోగం నచ్చలేదని చెప్పి వెళ్లిపోతుండడం.. ఉన్నతాధికారులను ఆందోళనకు గురి చేస్తోంది.