జన్మదిన వేడుకల పేరుతో ఓ వ్యక్తి 20మంది చిన్నారులను నిర్బంధించాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ వ్యక్తి ఓ హత్య కేసులో నిందితుడు కావడం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ ఆరా తీశారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
ఇదీ జరిగింది...
సుభాశ్ బాథమ్... ఓ హత్య కేసులో నిందితుడు. కథారియా గ్రామంలో జన్మదిన వేడుకల పేరుతో చిన్నారులను పిలిచాడు. అనంతరం వారిని ఓ ఇంట్లో నిర్బంధించాడు. గ్రామస్థులకు కొంత సేపటి తర్వాత ఆ ఇంటి నుంచి కాల్పుల శబ్దం వినిపించింది. పరిస్థితిని సమీక్షించేందుకు వెళ్లిన వారిపై అతడు కాల్పులు జరిపాడు.
గ్రామస్థులు తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. సుభాశ్ మానసిక స్థితి సరిగా లేదని స్పష్టం చేశారు.
"చిన్నారులను రక్షించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ప్రత్యేక పోలీసు దళం, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, ఉగ్రవాద నిరోధక బృందం రంగంలోకి దిగాయి."
--- పీవీ రామశాస్త్రి, ఏడీజీ.
లోపల ఉన్న వ్యక్తి ఎవరితోనూ మాట్లాడటానికి ఇష్టపడటం లేదని పోలీసులు తెలిపారు. తొలుత స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడతానని చెప్పినట్టు అధికారులు వివరించారు. కానీ ఎమ్మెల్యేతోనూ మాట్లాడలేదని స్పష్టం చేశారు. సుభాశ్ చెర నుంచి చిన్నారులను రక్షించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.