Hyderabad Police New Dress Code: పోలీసులంటే చాలు చేతిలో లాఠీ, ఖాకీ దుస్తులతో.. గంభీరమైన రూపంలో దర్శనమిస్తారు. అయితే ప్రస్తుతం నేరాల తీరు, పంథా రెండు మారాయి. ఇప్పుడు పోలీసులకు ప్రధాన సమస్యల్లా సైబర్ నేరాలే. అందుకే రాష్ట్రంలోని ప్రతి కమిషనరేట్, పోలీస్స్టేషన్లలో ప్రత్యేకంగా సైబర్ విభాగాలు ఏర్పాటయ్యాయి. ఆన్లైన్ మోసాలను అరికట్టాలంటే సాంకేతికతపై పట్టు తప్పని సరి. కేసుల ఛేదనకు పోలీసులు తీవ్రంగా కృషిచేస్తుంటారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటైన సీసీఎస్ పోలీస్స్టేషన్ సైబర్ నేరాల ఛేదనలో ప్రత్యేకంగా నిలుస్తోంది.
"మా జాయింట్ సీపీ సార్ మాకు నచ్చిన మంచి డ్రెస్కోడ్తో వచ్చేందుకు మాకు పర్మిషన్ ఇచ్చారు. ఇది మాకు చాలా సౌకర్యవంతంగా ఉంది. మేము కూడా ఒక ఐటీ సెక్టర్లో పనిచేస్తున్నట్లు ఉంది".- రాములు సైబర్ క్రైం కానిస్టేబుల్
హైదరాబాద్ సీసీఎస్ పోలీస్స్టేషన్ సిబ్బంది వస్త్రధారణ సాధారణ పోలీసులకు భిన్నంగా ఉండేలా ఉంటుంది. ఇందుకు కారణం జాయింట్ సీపీ గజరావ్ భూపాల్ తీసుకున్న నిర్ణయం. ఇక్కడి సిబ్బంది సివిల్ డ్రెస్లోనే విధులు నిర్వర్తించేవారు. జీన్స్, టీషర్ట్స్ వేసుకుని వచ్చేవారు. సైబర్ క్రైమ్ పోలీసుల వస్త్రధారణలో గజరావ్ భూపాల్ మార్పు తీసుకొచ్చారు. అందరు సిబ్బంది ఫార్మల్ డ్రెస్లోనే హుందాగా కనిపించాలని సూచించారు. షూ, ఇన్షర్ట్ తప్పనిసరి ఆదేశించారు. అప్పటి నుంచి సిబ్బంది అదేవిధంగా విధులకు హాజరవుతున్నారు.