దేశంపై శత్రువుల దాడి కంటే... ప్లాస్టిక్ దాడితోనే మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఏ పాపం తెలియని మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి ఆయిల్ తయారుచేసి ఈ సమస్యకు పరిష్కారం చూపుతున్నారు.
ప్లాస్టిక్ వ్యర్థాలతో ''ఫర్నెస్'' ఆయిల్..! తమిళనాడుకు చెందిన విద్యాఅమర్ నాథ్ పెరంబదూర్‌లో ఓ పరిశ్రమ ప్రారంభించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి శుద్ధి చేస్తారు. ఆ తరువాత అత్యధిక ఉష్ణోగ్రతలో వేడి చేస్తారు. అప్పుడు ఆవిరి బయటకు వస్తుంది. ఆ ఆవిరిని ఓ ట్యాంకులో నిక్షిప్తం చేస్తారు. తర్వాత అది ఆయిల్గా మారుతుంది. దాన్ని పరిశ్రమల్లో ఫర్నెస్ ఆయిల్గా, జనరేటర్లలో డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్నారు. సాధారణంగా ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవాలంటే 450 ఏళ్లు పడుతుంది. ఈ విధానం ద్వారా వెంటనే వ్యర్థాలు నిర్వీర్యమవుతాయి. ఇలాంటి ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు విద్యా అమర్నాథ్.
ప్రస్తుతం ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించలేమని సీపెట్ డైరక్టర్ కిరణ్‌కుమార్ చెబుతున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై దృష్టి పెట్టాల్సిన అవసరముందని అభిప్రాయపడుతున్నారు. నూతనంగా వచ్చిన ఈ ఆయిల్ తయారీ విధానంలో వ్యర్థాలు నిర్వీర్యమవుతాయని చెబుతున్నారు. ఇలాంటి నూతన విధానాలు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయని వివరించారు.
ప్లాస్టిక్ వ్యర్థాలు తిని పశువులు ప్రాణాలు కోల్పోతున్నాయని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి కంపెనీలకు ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలని పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు. వ్యర్థాల నుంచి ఆయిల్ వినియోగంపై అందరికీ అవగాహన కల్పించాలని, నూతన విధానాల వైపు ఔత్సాహికులు దృష్టి సారించాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు.
పరిసరాలు పచ్చదనంతో ఉండాలంటే ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణలో వస్తున్న నూతన పద్ధతులపై పరిశోధన చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యర్థాల నుంచి ఆయిల్ తయారీ విధానం నిర్వీర్యంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. రీసైక్లింగ్ విధానాల కంటే... వ్యర్థాలను పూర్తిగా నిర్వీర్యం చేసే విధానంపైనే దృష్టి పెట్టాలని పర్యావరణ హితులు కోరుతున్నారు.