రయ్‌మని దూసుకొచ్చే వాహనాలు.. దాటేందుకు వీలులేని రద్దీ నడుమ నగర రహదారులపై వాహనాలు నడపడమే కాదు నడవాలన్నా వణుకే. అరచేతిని అడ్డుపెట్టి ఆ వైపు నుంచి ఈ వైపు దాటే లోపే ఏ దారుణం జరిగిపోతుందనే బెంబేళెత్తిపోతున్నారు పాదచారులు. నగరంలో మూడింట ఒకటో వంతు ప్రమాదాలు రోడ్డు దాటుతుండగా జరుగుతున్నవే. ప్రమాదకర ప్రాంతాల్ని గుర్తించి 52 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించేందుకు 2019 మార్చిలో ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆర్నెల్లు తిరిగే లోపు లెక్కమారి 38 నిర్మించేందుకు సిద్ధమైంది. ఇప్పుడు అక్కడక్కడా పనులు మొదలైనా అవీ నత్తనడకనే సాగుతున్నాయి. దీంతో నగరదారులపై పాదాచారుల భద్రత ప్రశ్నార్థకమవుతోంది.
55.. 44.. 52.. 38.. లెక్కలకే!
పాదచారుల కోసం ట్రాఫిక్ పోలీసులు, కన్సల్టెన్సీ సంస్థలు ఇచ్చిన నివేదికల ఆధారంగా బల్దియా 2014లో 55 ఎఫ్‌ఓబీల నిర్మాణానికి సిద్ధమైంది. అధునాతన హంగులతో నిర్మిస్తామని ప్రకటించింది. అందుకు తగ్గట్లే ఇంజినీరింగ్ విభాగం టెండర్లకు పిలిచింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, హైటెక్‌సిటీ వంటి ప్రాంతాల్లో వాటిని నిర్మించేందుకు నిర్ణయించింది. టెండర్ల తర్వాత జరిగిన పరిణామాలతో గుత్తేదారులు ముఖం చాటేశారు. అనంతరం 44 ఎఫ్‌బీఓల నిర్మాణ బాధ్యతల్ని బల్దియా హెచ్‌ఎండీఏకు బదిలీ చేసింది. అక్కడా అదేతీరు కావడంతో తిరిగి 2019 మార్చిలో కొత్తగా ఎల్బీనగర్ జోన్‌లో 11, చార్మినార్ జోన్‌లో 11, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లలో 16, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి జోన్లలో 14 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించింది. మళ్లీ 38 నిర్మిస్తామని చెప్పి కొన్ని పనులు మొదలుపెట్టగా అవీ ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్లు తయారైంది.