రాష్ట్రంలో ధాన్యం సేకరణ ఆలస్యమవుతోంది. వానాకాలం ముగిసి యాసంగి మొదలైనప్పటికీ.. ఇంకా కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఏడాది ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా కూడా ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల శాఖ రంగంలోకి దిగలేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం ఎప్పుడా అని రైతులు ఎదురు చూస్తున్నారు. వానాకాలం ఆరంభం నుంచి ధాన్యాన్ని ప్రభుత్వం సేకరిస్తుందో...? లేదో అన్న సందేహాల నడుమ రైతులు ఆందోళనపడుతున్న తరుణంలో ఎట్టకేలకు ఓ స్పష్టత లభించింది. గత సంవత్సరం మాదిరిగానే ఈ వర్షాకాలం కూడా ధాన్యం సేకరణ జరిపిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
ఏ మాత్రం చలనం లేదు..
గత సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 6,545 ధాన్య సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని యధావిధిగా ఈ సంవత్సరం కూడా ఆ కేంద్రాలన్నింటి ద్వారా ధాన్యం సేకరణ జరపాలని పౌర సరఫరాల శాఖాధికారులను ఆదేశించినా... ఏ మాత్రం చలనం రావడం లేదు. యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో ముందస్తుగా వేసిన వరి పంటలు కోస్తున్నారు. చేతికి వచ్చిన పంట సేకరణ కోసం ఆయా శాఖలు ముందుకు రాకపోవడం, నిల్వ సామర్థ్యం గల గోదాములు అందుబాటులో లేకపోవడం వెరసి అధిక శాతం రైతులు ఇళ్లు, రోడ్లుపై, కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసి ఎండబెడుతున్నారు. రాళ్లు, తాలు తూర్పారబడుతూ ఎప్పుడు కాంటాలు వేస్తారోనని పనులన్నీ మానుకుని పడిగాపులు పడుతున్నారు.
అలా తీసుకొస్తేనే మద్ధతు ధర
ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి ప్రకటించారు. ధాన్యం శుభ్రపరచుకుని తేమ శాతం లేకుండా ఎండపోసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. మద్ధతు ధర ప్రకారం ధాన్యం కొనుగోలు జరగడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తాజాగా ప్రగతిభవన్‌లో ధాన్యం సేకరణపై సమీక్షలో సీఎం స్పష్టం చేశారు. దెబ్బతిన్న, రంగు మారినా, మొలకలు, పురుగు పట్టిన ధాన్యం 5 శాతం లోపు, మిశ్రమం 6 శాతం, అపరిపక్వత, కుంచించుకుపోయిన ధాన్యం 3 శాతం, ధాన్యం తేమ 13 నుంచి 14 శాతం మించకుండా నాణ్యతతో కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే కనీస మద్ధతు ధర రైతులకు లభిస్తుంది.
తెలంగాణలో రికార్డు స్థాయిలో..
వానాకాలం వరి సాధారణ సాగు విస్తీర్ణం 34.01 లక్షల ఎకరాలు ఉండగా... పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చిన సాగు నీటి వనరులు, నీటి లభ్యత దృష్ట్యా 41.85 లక్షల ఎకరాల్లో పంట సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనుకూల వాతావరణం, పుష్కలమైన నీరు, ఎమ్మెస్పీ భరోసా ఉండటంతో పెద్ద సంఖ్యలో వరి వైపే మొగ్గు చూపారు. అనూహ్యంగా 61.91 లక్షల ఎకరాల్లో 148 శాతం వరి సాగైంది. తెలంగాణ చరిత్రలో ఇదొక రికార్డు. గత ఏడాది ఖరీఫ్‌లో 52.24 లక్షల ఎకరాల్లో సాగైంది. గత వానాకాలంతో పోల్చుకుంటే ఈసారి దాదాపు 10 లక్షల ఎకరాల్లో వరి అధికంగా సాగైనందున సన్న, దొడ్డు రకాలు అన్న తేడా లేకుండా ధాన్యం కొనాలని రైతులు కోరుతున్నారు.
రైతుల్లో ఆందోళన
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 2021-22 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణ కోసం ప్రభుత్వం ఈ నెల 16న మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థ, సంక్షేమ పథకాల కింద అవసరమైన బియ్యం కోసం ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల సంస్థ, ఐకేపీ, హాకా, పీఏసీఎస్, డీసీఎంస్, జీసీసీ, వ్యవసాయ మార్కెట్ కమిటీలు ధాన్యం సేకరణకు సన్నద్ధమవుతున్నాయి. కేంద్రం... గ్రేడ్ - ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాల్ ధర 1960 రూపాయలు, సాధారణ రకం ధాన్యం క్వింటాల్ ధర 1940 రూపాయలు చొప్పున నిర్ణయించిన దృష్ట్యా జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో కొనుగోలు కేంద్రాలు ఈ నెలాఖరు లోపు లేదా దీపావళి లోగా కొనుగోళ్లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏ మాత్రం ఆలస్యమైనా, ఒకవేళ వర్షాలు పడితే మాత్రం అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యం అంతా తడిసిపోయే ప్రమాదం ఉందని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వానాకాలం, యాసంగి సీజన్లలో కలిపి 135 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్‌కు వస్తుందన్న అంచనాలు వెలువరించిన వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలు మానవతా ధృక్పథంతో... ఇటీవల భారీ వర్షాలు, వరదకు దెబ్బతిన్న, రంగు మారిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
ఏమైనా సమస్యలుంటే..
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు, సమస్యలు, అభ్యర్థనలు ఉన్నట్లైతే దృష్టికి తీసుకురావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు హైదరాబాద్ ఎర్రమంజిల్ పౌరసరఫరాల భవన్‌లో ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్ : 180042500333, 1967కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని పౌరసరఫరాల శాఖ సూచించింది.
ఇదీ చదవండి: Education Loan: విద్యా రుణం సులభంగా చెల్లించండిలా..!