తెలంగాణ

telangana

Business Summit on NMEO-OP: హైదరాబాద్ వేదికగా ఆయిల్‌పామ్‌ పరిశ్రమ బలోపేతంపై జాతీయ సదస్సు

By

Published : Dec 28, 2021, 7:09 AM IST

Oil Palm Business Summit: ఆయిల్‌పామ్‌ పరిశ్రమ బలోపేతంపై కేంద్రం దృష్టి సారించింది. నేషనల్ ఎడిబుల్ ఆయిల్ మిషన్ - ఆయిల్‌పామ్ పథకం కింద ఈశాన్య రాష్ట్రాల్లో విస్తృత ప్రచారం చేసేవిధంగా చర్యలు తీసుకుంటుంది. జాతీయ సదస్సు వేదికగా వచ్చిన ప్రతిపాదనలు, సూచనలు, క్రోఢీకరించి.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిత్వశాఖ.. ఓ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించనుంది.

Oil Palm Business Summit 2021
ఆయిల్ మిషన్

Oil Palm Business Summit: స్వయం సమృద్ధి లక్ష్యంగా రైతుల ఆదాయాలు రెట్టింపు, పర్యావరణహితం దృష్ట్యా పంట మార్పిడి విధానం, ముడి వంట నూనెల దిగుమతులు పూర్తిగా తగ్గించుకోవాలన్న లక్ష్యంతో కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో ఆయిల్‌పామ్ రైతుల సంక్షేమం, పరిశ్రమ బలోపేతంపై.. ప్రత్యేక దృష్టి సారించింది. నేషనల్ ఎడిబుల్ ఆయిల్ మిషన్ - ఆయిల్‌పామ్ పథకం గురించి.. ఈశాన్య రాష్ట్రాల్లో విస్తృత ప్రచారం చేయడానికి ఉద్దేశించి... అక్టోబరు 5న గౌహతిలో బిజినెస్ సమ్మిట్ నిర్వహించింది.

తాజాగా హైదరాబాద్ వేదికగా ఈ కీలక జాతీయ సదస్సు జరగనున్న దృష్ట్యా.. ఆయిల్‌పామ్ రైతులకు మంచి రోజులు రానున్నాయని ఉద్యాన శాఖ వర్గాలు తెలిపాయి. మాదాపూర్‌ హెచ్​సీసీ నొవాటెల్‌లో రెండు రోజులపాటు జరగనున్న సదస్సును.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తొమర్ ప్రారంభిస్తారు. ఈ సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సహా పలు రాష్ట్రాల మంత్రులు, కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి, పలు రాష్ట్రాల కార్యదర్శులు, కమిషనర్లు, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర తదితరులు పాల్గొననున్నారు. పంట సాగు చేసే 9 రాష్ట్రాలకు చెందిన.. 250 మంది ప్రతినిధులు హాజరవుతారు.

సూచనలతో కార్యచరణ ప్రణాళిక

వాతావరణ మార్పుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా... ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఆయిల్‌పామ్ పంట సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదతక పెంపు, రైతులకు ఇతోధిక రాయితీ, ఇతర ప్రోత్సాహకాలు, ఆదాయాలు పెంపు, ఆయిల్ పరిశ్రమ బలోపేతం, ఈ రంగంలో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. పామాయిల్ వినియోగంలో ఇండోనేషియా అగ్రస్థానంలో ఉండగా... భారత్‌ రెండో స్థానంలో ఉంది.

దేశం మొత్తం దిగుమతుల్లో సంవత్సరానికి 10 మిలియన్ టన్నులు అంటే 60 శాతం పామాయిల్ నూనె 70 వేల కోట్ల రూపాయలు పైగా వెచ్చించి చేసుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం దేశంలో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల సీపీఓ ఉత్పత్తిలో 10 లక్షల ఎకరాల విస్తీర్ణంలో రైతులు ఆయిల్‌పామ్ పంట సాగు చేపట్టారు. ఆయిల్‌పామ్ పంట సాగు పెద్ద ఎత్తున రైతుల్లో ప్రోత్సహించడం కోసం ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం "నేషనల్ ఎడిబుల్ ఆయిల్‌ మిషన్ - ఆయిల్‌పాం - ఎన్‌ఎంఈఓ-ఓపీ" అనే కొత్త పథకం ప్రారంభించింది. ఈ పథకం కింద పామాయిల్ ఉత్పత్తి 2025-26 సంవత్సరం నాటికి మూడు రెట్లు పెరిగి 11.20 లక్షల మెట్రిక్ టన్నులు, 2029-30 సంవత్సరం నాటికి 28 లక్షల టన్నులకు చేరరుకుంటుందని కేంద్రం అంచనా వేస్తోంది. జాతీయ సదస్సు వేదికగా వచ్చిన ప్రతిపాదనలు, సూచనలు, క్రోఢీకరించి.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిత్వశాఖ.... ఓ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించనుంది.

ఇదీ చూడండి: Oil palm cultivation telangana 2021: ఆయిల్​పాంతో లాభాలంట.. సదుపాయాలు మాత్రం కల్పించరంట!

ABOUT THE AUTHOR

...view details