రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో చిన్న తప్పు జరిగిందని.. ఆ తప్పు జరిగినట్లు ఏ పార్టీ చెప్పక ముందే, తామే గుర్తించామని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. పేపర్ లీక్ అయితే పరీక్ష రాసిన అభ్యర్థులకు నష్టం జరుగుతుందని భావించి ఆ పరీక్షలను రద్దు చేశామని తెలిపారు. దీనిపై విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేశామని వివరించారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గతంలో 13 రాష్ట్రాల్లో పేపర్ లీక్ అయితే ఏ ఎమ్మెల్యే, మంత్రి కానీ రాజీనామా చేయలేదని పల్లా రాజేశ్వర్‌రెడ్డి గుర్తు చేశారు. కానీ ప్రతిపక్షాలు కేటీఆర్ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని వివరించారు. ఎక్కడ పక్షపాతంతో తమ పార్టీ నాయకులకు.. కార్యకర్తలకు ఉద్యోగాలు వచ్చేలా చేయలేదని తెలిపారు. పరీక్షల్లో అర్హులు మాత్రమే పద్దతి ప్రకారం నియమితులయ్యారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు.
ఇలాంటి వాటికి భయపడేది లేదు: కేంద్రం ప్రతిపక్షాలపై ఈడీ, సీబీఐ, ఐటీ సోదాలు చేస్తామంటూ బెదిరిస్తున్నారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఇలాంటి వాటికి భయపడేది లేదని స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ, నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్, సోనియా, రాహుల్ గాంధీలను బీజేపీ నాయకులు దుషిస్తున్నా.. కోర్టులో ఉండే జడ్జీలకు కనిపించడం లేదని పేర్కొన్నారు. కానీ రాహుల్‌గాంధీని జైలులో వేస్తున్నారని అన్నారు. దీనిని ప్రశ్నించడంలో కాంగ్రెస్ నాయకులు అసమర్ధులు అయ్యారన్నారు. బీజేపీ చేస్తున్న అరాచకాలను ఖండించి.. వాటిపై కేసీఆర్ పోరాడుతున్నారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి వెల్లడించారు.
"ప్రజలందర్ని గౌరవించే ఏకైక ప్రభుత్వం తెలంగాణ మాత్రమే. కేంద్రం నుంచి ఇవ్వాల్సిన పన్నులు సరిగ్గా ఇవ్వడం లేదు. విద్యుత్ అందరికి అందేలా చేశాం. రైతుబంధు, మంచినీటి సరఫరా తదితర పథకాలు అమలు చేశాం.ఇవి అన్ని కేసీఆర్ చిత్త శుద్ది వల్లే సాధ్యం అయ్యాయి. ఇలాంటివి మిగతా ఏ రాష్ట్రంలో కూడా అమలు కావట్లేదు. కాంగ్రెస్ నాయకులు రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేసిన పోరాడట్లేదు.ఈ విషయంలో కేసీఆర్ పోరాడుతున్నారు. ఎందుకంటే మా పార్టీ ఈడీ, సీబీఐలకు బెదిరిపోం. మేము ఎప్పుడు ప్రజలను నమ్ముకుంటాం."- పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ
ఇవీ చదవండి: