తెలంగాణ

telangana

By

Published : Jan 4, 2022, 7:18 AM IST

ETV Bharat / state

KTR about Punjab Champion: పంజాబ్‌ ప్రభుత్వంపై దివ్యాంగ క్రీడాకారిణి ఆగ్రహం.. అండగా కేటీఆర్‌

KTR about Punjab Champion : పంజాబ్‌ ప్రభుత్వంపై దివ్యాంగ క్రీడాకారిణి మాలిక హండా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగంతో పాటు ఆర్థిక ప్రోత్సాహకం అందజేస్తామన్న హామీని ఆ రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని వాపోయింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓ వీడియో విడుదల చేసింది. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు.

KTR about Punjab Champion, ktr news
పంజాబ్‌ ప్రభుత్వంపై దివ్యాంగ క్రీడాకారిణి ఆగ్రహం

KTR about Punjab Champion : తనకు ఉద్యోగంతో పాటు ఆర్థిక ప్రోత్సాహకం అందజేస్తామన్న హామీని పంజాబ్‌ ప్రభుత్వం విస్మరించిందని దివ్యాంగ చెస్‌ క్రీడాకారిణి మాలిక హండా ఆగ్రహం వ్యక్తంజేసింది. బదిర క్రీడాకారుల కోసం ఎలాంటి క్రీడా విధానం లేనందున తనకు సహాయం చేయలేకపోతున్నట్లు పంజాబ్‌ క్రీడల మంత్రి పర్గత్‌సింగ్‌ అన్నట్లు మలిక వాపోయింది. పంజాబ్‌ ప్రభుత్వాన్ని నమ్ముకుని అయిదేళ్ల సమయం వృథా చేసుకున్నానని ఆవేదన వ్యక్తంజేసింది. పంజాబ్‌కు చెందిన మాలిక హండా.. అంతర్జాతీయ బదిరుల చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. ప్రపంచ, ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో ఆరు పతకాలు సాధించింది. జాతీయ బదిరుల చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో ఏడు సార్లు విజేతగా నిలిచింది. ఉద్యోగం, నగదు బహుమతి విషయంలో రెండు నెలలుగా పంజాబ్‌ ప్రభుత్వం ఆహ్వానం కోసం ఎదురు చూస్తున్నట్లు గత ఏడాది నవంబరులో మాలిక ట్వీట్‌ చేసింది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లభించకపోవడంతో ఆదివారం మరో వీడియో పోస్ట్‌ చేసింది. డిసెంబరు 31న క్రీడల మంత్రి పర్గత్‌సింగ్‌ను కలవగా.. బదిర క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా క్రీడా విధానం లేకపోవడంతో ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదని చెప్పినట్లు 25 ఏళ్ల మాలిక వాపోయింది.

క్రీడాకారిణి ఆగ్రహం

‘‘బహుమతి ఎందుకు ప్రకటించారని మాత్రమే అడుగుతున్నా. పంజాబ్‌ ప్రభుత్వాన్ని నమ్ముకుని అయిదేళ్లు వృథా చేసుకున్నా. వాళ్లు నన్ను మోసం చేశారు. బదిర క్రీడాకారుల్ని పట్టించుకోవట్లేదు. తనను ఆదుకుంటామని జిల్లా నాయకులు ఈ అయిదేళ్లు హామీ ఇస్తూ వచ్చారు. కానీ ఇప్పటి వరకు ఏమీ జరగలేదు. పంజాబ్‌ ప్రభుత్వం ఎందుకిలా చేస్తోంది?’’ అని మాలిక ఆగ్రహం వ్యక్తంజేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఒక స్వర్ణం, రెండు రజతాలు గెలిచిన సమయంలో మాలికకు ప్రభుత్వ ఉద్యోగం, నగదు ప్రోత్సాహకం అందిస్తామని అప్పటి పంజాబ్‌ క్రీడల మంత్రి ఆమెకు హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వ హామీని పాలకులు నిలబెట్టుకోకపోవడం తనను తీవ్ర నిరాశకు గురిచేస్తుందని మాలిక ఆవేదన వ్యక్తం చేస్తోంది.

అండగా కేటీఆర్..

సామాజిక మాధ్యమంలో మాలిక వీడియో వైరల్‌ కావడంతో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ‘‘మీకు వీలైతే ఈ యువ ఛాంపియన్‌ వివరాలు నాకు పంపండి. నా వ్యక్తిగత హోదాలో సహకారం అందిస్తా’’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. మంత్రి కార్యాలయ సిబ్బంది మాలిక కుటుంబాన్ని సంప్రదించగా.. తమకు సాయం అందించడానికి ముందుకొచ్చిన కేటీఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి:రైతుల ఖాతాలో సాయం పడగానే.. రుణాల పేరిట బ్యాంకుల కోతలు..

ABOUT THE AUTHOR

...view details