రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీకి అన్ని రకాలుగా సహకరిస్తామని మంత్రి కేటీఆర్ హామీ (minister ktr) ఇచ్చారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఇండో-ఫ్రెంచ్ పెట్టుబడిదారుల సదస్సులో ఫ్రెంచ్ వ్యాపార ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ చర్చలు జరిపారు (Indo-French Investors Conference) . ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతిపాదనలకు సమానంగా లేదా అంతకు మించి ప్రోత్సాహకాలను తెలంగాణ రాష్ట్రం అందిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
పెట్టుబడులకు అపార అవకాశాలు
హైదరాబాద్లో సినోఫి, కియోలిస్, సెయింట్ గోబెన్, సాఫ్రిన్, క్యాప్ జెమినై వంటి కంపెనీలు ఇప్పటికే రాణిస్తున్నాయని.. మరిన్ని కంపెనీలు తమ కార్యకలాపాలు ఇక్కడ విస్తరించేందుకు అపార అవకాశాలున్నాయని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామికీకరణకు మెరుగైన పాలసీలతో పాటు.. భూమి, విద్యుత్, నీరు, రాయితీలు, మానవ వనరులు అన్నీ సంపూర్ణంగా ఉన్నాయని.. ఫ్రెంచ్ దేశానికి చెందిన భారీ కంపెనీలతో పాటు మధ్యతరహా కంపెనీలను సైతం తెలంగాణలో రాణించొచ్చని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఫ్రెంచ్ వ్యాపార వర్గాలతో ప్రత్యేకంగా సమావేశమైన మంత్రి కేటీఆర్... ఆయా కంపెనీల పెట్టుబడి ఆలోచనలు, ఆసక్తిని తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆయా రంగాల్లో ఉన్న అనుకూలతలను కంపెనీ ప్రతినిధులకు వివరించారు.