రాష్ట్రంలో పత్తి పంట దిగుబడి అంచనాలు లెక్క తప్పాయి. వ్యవసాయ శాఖ తాజా అంచనాల ప్రకారం పంట దిగుబడి తగ్గిందని మార్కెట్ల లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 46.92 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి పంట సాగుచేశారు. 4.22 కోట్ల క్వింటాళ్ల పత్తి పంట దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ గత అక్టోబరులో ప్రభుత్వానికి నివేదించింది. అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకూ కేవలం కోటిన్నర క్వింటాళ్లు మాత్రమే మార్కెట్కు వచ్చింది.
రైతుల ఆందోళన..
గత ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు కురిసిన భారీ వర్షాలతో పత్తి పంటకు అధికంగా నష్టం కలిగింది. ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు 2.43 కోట్ల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆర్థిక, గణాంక శాఖ తొలి అంచనాల్లో తేలిపింది. అంతకన్నా ఎక్కువగా 4.22 కోట్ల క్వింటాళ్లు వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఒక ఎకరానికి 9 క్వింటాళ్ల వరకు పంట ఉత్పాదకత వస్తుందని తెలిపినా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు ఏ మాత్రం కనిపించడం లేదు.
ఐదారు క్వింటాళ్లకు మించి రావడంలేదు
వర్షాల ప్రభావంతో పత్తికాయ నల్లగా మారి కొన్ని చోట్ల ఎకరానికి ఐదారు క్వింటాళ్లకు మించి దూది రావడంలేదు. భారత పత్తి సంస్థ-సీసీఐ రాష్ట్రంలో మద్దతు ధరకు ఇప్పటి వరకూ 1.13 కోట్ల క్వింటాళ్ల పత్తిని రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసింది. ప్రైవేటు వ్యాపారులు మరో 34 లక్షల క్వింటాళ్ల వరకు కొనుగోలు చేశారు. ఇక సరిహద్దు జిల్లాల వారు ఇతర రాష్ట్రాలకు కొంత తరలించి అమ్ముకుంటున్నారు. అంతా కలిపినా ఇప్పటికీ మార్కెట్లకు కోటిన్నర క్వింటాళ్లకు మించి రాలేదని మార్కెటింగ్ శాఖ వర్గాలు తెలిపాయి.