Women Welfare Celebrations in Telangana : మహిళా సంక్షేమంలో మన తెలంగాణ రాష్ట్రం.. యావత్ దేశానికే ఆదర్శమని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు మహిళా దినోత్సవం నిర్వహిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ వరుస ట్వీట్స్ చేశారు. ఆకాశంలో సగం కాదు.. 'ఆమే' ఆకాశమని.. సంక్షేమంలో సగం కాదు.. 'ఆమే' అగ్రభాగమని వ్యాఖ్యానించారు. అప్పుడే పుట్టిన ఆడ బిడ్డ నుంచి.. ఆరు పదులు దాటిన అవ్వల వరకు.. అందరినీ కేసీఆర్ సర్కార్ కంటికి రెప్పలా కాపాడుతోందని తెలిపారు.
Minister KTR Today Tweet :ఈ క్రమంలోనే రాష్ట్రంలో గర్భిణీలకు ఇచ్చే న్యూట్రిషన్ కిట్లు.. ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి తొలి అడుగులని కేటీఆర్ పేర్కొన్నారు. ఆడబిడ్డ పుట్టిందంటే ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టినట్లే అన్న ఆయన.. కేసీఆర్ కిట్‌తో పాటు అందే రూ.13 వేలు.. ప్రతి పుట్టిల్లు ఎప్పటికీ మరువలేని మేలని వ్యాఖ్యానించారు. లక్ష్మీ కటాక్షమే కాదు.. తెలంగాణ ఆడబిడ్డలకు సరస్వతీ కటాక్షంకూడా ఉందని, కార్పొరేట్‌కు దీటైన గురుకులాలతో తల్లిదండ్రుల కలలు సాకారం అవుతున్నాయని తెలిపారు. ఆడబిడ్డలకు రక్షణ కవచంగా నిలిచిన 'షీ-టీమ్' ఓ సంచలనమని, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే 'వీ-హబ్'.. ఓ సంకల్పమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
- షీ టీమ్.. ఓ సంచలనం
- వీ హబ్.. ఓ సంకల్పం
- కల్యాణలక్ష్మి.. ఓ విప్లవం
Telangana Decade Celebrations 2023 :స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఓ నవశకం అన్న కేటీఆర్.. మార్కెట్ కమిటీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఓ ప్రోత్సాహం అని పేర్కొన్నారు. ప్రతి బతుకమ్మ పండుగకు చీరల పంపిణీ ఓ గొప్ప సంప్రదాయమని తెలిపారు. కల్యాణలక్ష్మి కేవలం పథకం కాదని.. ఒక విప్లవం అన్న ఆయన.. ఓవైపు బ్రూణ హత్యలకు బ్రేక్ పడిందని, మరోవైపు బాల్య వివాహాలకు ఫుల్ స్టాప్ చెప్పినట్లైందని అన్నారు. ఇంకోవైపు తల్లిదండ్రుల భారాన్ని దించే భరోసా అన్న మంత్రి... పది లక్షలకు పైగా ఆడబిడ్డల పెండ్లిళ్లు చేసిన మేనమామ సీఎం కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. గుక్కెడు మంచినీళ్ల కోసం మైళ్లదూరం నడిచిన మహిళల కష్టాలను.. మిషన్ భగీరథతో శాశ్వతంగా తీర్చిన విజన్ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు.
- అక్కాచెల్లెళ్లకు అన్నలా..
- ఒంటరి మహిళలకు తండ్రిలా..
- ఆడబిడ్డలకు మేనమామలా..
- కొండంత అండగా సీఎం కేసీఆర్