KTR Fires on Kishan Reddy : సొంత రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక కిషన్ రెడ్డి తత్తర బిత్తర మాట్లాడి పరువు తీసుకోవడాన్ని అలవాటుగా మార్చుకున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నగరానికి ఒక్కపైసా కూడా అదనంగా తేలేని కేంద్ర మంత్రి, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిలో కేంద్రం వాటా ఎంతో ప్రజలకు వివరిస్తే మంచిదన్నారు.
వరదలతో అతలాకుతలమైన హైదరాబాద్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి నయాపైసా నిధులు తీసుకురాలేని నిస్సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నిధులు, సంస్థలను సొంత రాష్ట్రం గుజరాత్‌కు తరలించుకుపోయిన ప్రధానమంత్రిని ఇదేంటని కిషన్ రెడ్డి అడగలేకపోతున్నారని ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డి తెలంగాణ సొమ్ము తింటూ నరేంద్ర మోదీ పాట పాడుతున్నారని మండిపడ్డారు.
తన సొంత నియోజకవర్గం సికింద్రాబాద్‌లో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏం అభివృద్ధి చేశారో కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా తాము చేస్తున్న అభివృద్ధి పనులకు ఎస్అర్డీపీ, ఎస్ఎన్డీపీ, సీఅర్‌ఎంపీ కార్యక్రమాలు, వైకుంఠ ధామాలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలే నిదర్శనం వివరించారు.
మాటలు బంద్ చేసి నిధులు తీసుకురండి: హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థలను మెరుగుపరిచేందుకు ఎస్‌ఆర్‌డీపీ ద్వారా రూ.5,660 కోట్ల వ్యయంతో 47 పనులు చేపట్టామని, అందులో ఇప్పటి వరకు 32 పనులు పూర్తయ్యాయని కేటీఆర్ వివరించారు. లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు లేకుండా ఉండేందుకు ఎస్‌ఎన్‌డీపీ ద్వారా నగరం చుట్టూ ఉన్న మున్సిపాలిటీల్లో 56 పనులు.. జీహెచ్ఎంసీ పరిధిలో 35 పనులను చేపట్టినట్లు తెలిపారు.