Kishan Reddy Today News : రాష్ట్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గురించి తెలుసుకోవడానికి వెళ్లే హక్కు కూడా కేంద్రమంత్రిగా తనకు లేదా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. పోలీసులు తనతో ప్రవర్తించిన తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఉగ్రవాదితో, నేరస్థుడితో ఎలా వ్యవహరిస్తారో.. ఇవాళ తనతో పోలీసులు అలా వ్యవహరించారని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుకలను ప్రగతిభవన్‌లో కూర్చొని అణచివేస్తారా అంటూ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే ప్రజల ఆవేదన, ఆక్రోశం బీజేపీ నేతల అరెస్టులతో తగ్గదన్న ఆయన.. ప్రజల తరఫున బీఆర్ఎస్తో యుద్ధానికి తాము సిద్ధమని ప్రకటించారు. ప్రజల సమస్యల తరఫున యుద్ధం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా నాంపల్లిలోని తమ పార్టీ కార్యాలయం ముందు భారీగా పోలీసుల మోహరింపు ఎందుకని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తే.. ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదాఅని ప్రశ్నించారు. తన జీవితంలో ఇప్పటి వరకు ఎలాంటి తప్పు చేయలేదని.. అలాంటి తనను నేరస్థుడిలా చూస్తూ అదుపులోకి తీసుకున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే కల్వకుంట్ల కుటుంబం అభద్రతా భావంతో ఉందన్న ఆయన.. ప్రజలకు సమాధానం చెప్పలేని స్థితిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. ప్రజల సమస్యలపై పోరాడుతుంటే తమను అరెస్టు చేస్తున్నారని.. రాష్ట్ర ప్రజల తరఫున యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పేద ప్రజలకు న్యాయం జరగట్లేదు. రెండు పడక గదుల ఇళ్లు ఎవరికీ ఇవ్వడం లేదు. ప్రభుత్వంపై ఇంకా పూర్తిస్థాయిలో ఉద్యమం ప్రారంభించలేదు. నేరస్థుడు, ఉగ్రవాదితో ఎలా వ్యవహరిస్తారో నాతో అలా వ్యవహరించారు. పేదల బాధలను చూడటానికి వెళ్తే అరెస్టులు చేస్తారా. ప్రజలకు సమాధానాలు చెప్పలేని నిస్సహాయ స్థితిలో బీఆర్ఎస్ ఉంది. రాష్ట్ర ప్రజల తరఫున యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాం. కల్వకుంట్ల కుటుంబం, బీఆర్ఎస్తో యుద్ధానికి సిద్ధం. ప్రజల సమస్యల తరపున యుద్ధం కొనసాగిస్తాం. - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం..: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పట్ల పోలీసుల తీరుపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై లోక్‌సభ స్పీకర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు.