DGPగా అంజనీకుమార్ బాధ్యతల స్వీకరణ.. సీఎం కేసీఆర్ విషెస్ Anjani Kumar Take charge as New DGP : ప్రజలకు నాణ్యమైన పోలీస్ సేవలు అందేలా చేసేందుకు ఎన్నో చర్యలు చేపట్టామని పదవీ విరమణ కార్యక్రమంలో మహేందర్ రెడ్డి స్పష్టంచేశారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో.. పలువురు ఉన్నతాధికారులు, పోలీసులు పాల్గొన్నారు. ముందుగా మహేందర్ రెడ్డి అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం నూతన డీజీపీ అంజనీ కుమార్‌కి అభినందనలు తెలిపారు.
ప్రతిభ కలిగిన అంజనీ కుమార్ నేతృత్వంలో రాష్ట్ర పోలీస్ శాఖ మరింత ముందుకెళ్తుందని ఆయన ఆకాంక్షించారు. మహేందర్‌రెడ్డితో కలిసి పని చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలిపిన కొత్త డీజీపీ.. పోలీస్‌శాఖకు సాంకేతికతను జోడించడంలో ఆయన చొరవ అభినందనీయమని కొనియాడారు. ఆయన లక్ష్యాలను కొనసాగిస్తానని చెప్పారు.
సిబ్బంది ఘనస్వాగతం: ఏసీబీ డీజీ కార్యాలయం నుంచి వచ్చిన అంజనీ కుమార్‌కి.. సిబ్బంది అధికారికంగా ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత నేరుగా డీజీపీ చాంబర్‌లోకి వెళ్లి మహేందర్‌రెడ్డిని కలిశారు. ఆ తర్వాత ముందే నిర్దేశించుకున్న ముహుర్తం మేరకు మధ్యాహ్నం 12.57 నిమిషాలకు డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పలువురు పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. బిహార్ రాజధాని పాట్నాలో 1966 జనవరి 28న జన్మించిన అంజనీకుమార్ పాట్నాతోపాటు దిల్లీలో విద్యాభ్యాసం పూర్తిచేశారు.
ఐక్యరాజ్య సమితి నుంచి శాంతి మెడల్: 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా శిక్షణ పూర్తిచేసుకున్నారు. పోలీస్‌శాఖలో మంచి పోస్టింగులలో పనిచేశారు. పలు అవార్డులు సైతం దక్కించుకున్నారు. రెండు సార్లు ఐక్యరాజ్య సమితి శాంతి మెడల్ అందుకున్నారు. హైదరాబాద్ సిటీ పోలీసుల 500ఏళ్ల చరిత్రపై రాసిన పుస్తకంలోనూ.. తన భాగస్వామ్యాన్ని అంజనీకుమార్ అందించారు. అంజనీకుమార్ 2026 జనవరిలో పదవీ విరమణ చేయనున్నారు. ఆనంతరం డీజీపీ కార్యాలయంలో మహేందర్ రెడ్డికి.. పోలీస్ ఉన్నతాధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.
కేసీఆర్ శుభాకాంక్షలు:ప్రత్యేకంగా అలంకరించిన వాహనాన్ని ముందుకులాగుతూ గౌరవ వీడ్కోలు తెలిపారు. సంప్రదాయబద్ధంగా వస్తున్న ఈ కార్యక్రమంలో సీనియర్ ఐఏఎస్‌లు పాల్గొన్నారు. వాహనంపై నుంచి మహేందర్‌రెడ్డి అందరినీ పలకరించారు. కార్యాలయం ప్రధాన గేటు వరకూ వాహనాన్ని తీసుకెళ్లారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అంజనీకుమార్ ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రగతి భవన్‌లో సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. డీజీపీ అంజనీ కుమార్‌కి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
"ఎలాంటి పరిస్థితుల్లోనైనా తమ పనితీరు ఒకే విధంగా ఉంటుంది. ఏటూర్ నాగారం వంటి మారుమూల ప్రాంతమైనా.. ఐటీహబ్‌గా పేరుపొందిన ఫైనాన్షియల్ జిల్లా అయినా తమ స్పందన ఒకేలా ఉంటుంది. ప్రజలకు మంచి సేవలు అందించడమే లక్ష్యం. అందులో భాగంగా పనితీరును రోజురోజుకు మెరుగుపర్చుకుంటూ ముందుకెళ్తున్నాం. పోలీస్‌శాఖకు సాంకేతికతను జోడించి ఇంటింటికి తీసుకెళ్లడంతో మహేందర్ రెడ్డి చూపిన చొరవ ఎంతో అభినందనీయం. ప్రతి పౌరుడు ఒక పోలీసే. ప్రతి పోలీస్ ఒక పౌరుడే."-అంజనీ కుమార్, డీజీపీ
ఇవీ చదవండి: