Hyderabad Traffic Diversions : హైదరాబాద్‌లోని ప్రధాన రహదారుల్లో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు వాహనాల రద్దీ అధికంగా ఉంటోంది. పాఠశాలలు, కార్యాలయాలు, వ్యాపార వాణిజ్య సముదాయాలకు వెళ్లే వాళ్లతో రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. వర్షం పడిన సమయంలో వాహనాలు వేగంగా ముందుకువెళ్లలేక నెమ్మదిగా కదులుతుండటంతో రహదారులన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. రహదారులపై వర్షపు నీరు నిలుస్తే సమస్య మరింత జఠిలమవుతోంది. కిలోమీటర్ ప్రయాణానికే.. 15 నుంచి 30 నిమిషాల సమయం పడుతోంది. వాహనాలను క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.
Traffic Diversion At IT Corridor :ఇక ఐటీ కారిడార్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. దాదాపు 5లక్షల మంది ఉద్యోగులు ఐటీ కారిడార్‌లోని వివిధ కంపెనీల్లో పనిచేస్తున్నారు. కరోనా సమయంలో అంతా ఇంటినుంచి పనిచేయడంతో వాహనాల రద్దీ లేదు. కానీ కొన్ని నెలలుగా పలు కంపెనీలు ఉద్యోగులను కార్యాలయాలకు రావాలంటూ ఆదేశాలు జారీ చేశాయి. అంతా ఒకేసారి కాకుండా వారంలో కొందరు.. మరుసటి వారంలో మరికొందరిని కార్యాలయాలకు పిలిచి పనిచేయించుకుంటున్నాయి. ఆ విధంగా చూసుకున్నా దాదాపు లక్ష నుంచి లక్షన్నర మంది ఉద్యోగులు కార్యాలయాలకు వస్తుండటంతో.. ఐటీ కారిడార్‌లోని రోడ్లన్ని వాహనాలతో నిండిపోతున్నాయి.
Hyderabad Rains : సోమవారం సాయంత్రం గంట వ్యవధిలో భారీ వర్షం పడటంతోఉద్యోగులంతా కార్యాలయాల్లోనే ఉన్నారు. వర్షం నిలిచిన వెంటనే అంతా ఇళ్లకు చేరుకునేందుకు ఒక్కసారిగా బయటికి రాగా ట్రాఫిక్‌జాం ఏర్పడింది. గచ్చిబౌలి, ఐకియా సర్కిల్, ఏఐజీ ఆస్పత్రి, హైటెక్‌సిటీ, మాదాపూర్, రాయదుర్గం, నానక్‌రామ్ గూడ, విప్రో సర్కిల్, కొండాపూర్ రహదారులు వాహనాలతో నిండిపోయాయి. వర్షంలోనే గంటల తరబడి రోడ్లపై ఉండాల్సి రావడంతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర నేరుగా రహదారులపైకి వచ్చి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. ట్రాఫిక్ పోలీసులతో పాటు శాంతిభద్రతల విభాగానికి చెందిన పోలీసులు రహదారులపైనే ఉండి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ట్రాఫిక్ సమస్య ఎక్కువగా లేని ప్రాంతాల నుంచి సిబ్బందికి ఐటీ కారిడార్‌లో విధులు కేటాయిస్తున్నారు.