తెలంగాణ

telangana

మీ మెడలో గోల్డ్ చైన్ ఉందా.. బస్సు ఎక్కితే మాత్రం కాస్త జాగ్రత్తండోయ్..

By

Published : Mar 29, 2023, 9:04 AM IST

Mangar Basti gang arrest in Hyderabad : రద్దీగా ఉన్న ఆర్టీసీ సిటీ బస్సుల్లో ప్రయాణికులలాగా ఎక్కుతారు. మెడలో బంగారు గొలుసులు ధరించిన వృద్ధులు, ఏమరపాటుగా కనిపించిన వారిని లక్ష్యం చేసుకుంటారు. వారి దృష్టి మరల్చి వారికి తెలియకుండా సొత్తు కాజేస్తారు. ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్న మంగార్‌ బస్తీ ముఠాను హైదరాబాద్‌ తూర్పు మండల పోలీసులు అరెస్ట్ చేశారు.

Mangar Basti Gang was arrested by Task Force Police
మంగార్ బస్తీ ముఠాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్ చేశారు

Mangar Basti gang arrest in Hyderabad : హైదరాబాద్‌లో బస్సు ప్రయాణికుల్నే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న మంగార్ బస్తీ ముఠాను తూర్పు మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు కేఎస్​ మక్కాన్‌తో పాటు.. మిగతా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రూ.18.50 లక్షల విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి బంగారం కొంటున్న ప్రవీణ్ అనే వ్యక్తిని కూడా కటకటాల్లోకి నెట్టారు. పరారీలో ఉన్న మరో ఆరుగురి కోసం గాలిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాంగార్‌ బస్తీకి చెందిన మక్కాన్ వివిధ పేర్లతో చెలామణీ అవుతుంటాడు. దొంగతనం చేసే ప్రాంతాల్లో ముందే రెక్కీ నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌ లావాదేవీలు పెరగడం, పర్సుల్లో ఏటీఎం కార్డులు తప్ప ఏం దొరక్కపోవటంతో ఈ ముఠా రూటు మార్చింది. రద్దీ ప్రాంతాల్లో మెడలో బంగారు గొలుసు వేసుకున్న పురుషులనే లక్ష్యంగా చేసుకుంటున్నారు.

pickpocketers gang arrest in Hyderabad : 'మంగార్ బస్తీ నుంచి ఏడుగురు దొంగలు ఆటోల్లో బీహెచ్​ఈఎల్​ కూకట్‌పల్లి వంటి బస్టాపుల వద్దకు చేరతారు. రద్దీగా ఉండే ఆర్టీసీ సిటీ బస్సుల్లో ఎక్కుతారు. మెడలో బంగారు గొలుసులు వేసుకున్నవారిని లక్ష్యంగా చేసుకుంటారు. బస్సు మెట్లకు సమీపంలోకి రాగానే.. మన్నన్, సికిందర్, హిరా, బక్రి సికిందర్, బోలా అనే చోరులు ప్రయాణికుడి చుట్టు చేరతారు. ప్రయాణికుడి దృష్టి మరల్చేందుకు హడావుడి చేస్తారు. సమీపంలోని స్టాపులో దిగుతాం అన్నట్లుగా భ్రమ కల్పిస్తారు. ఇదే అదనుగా 'బోలా' అనే దొంగ ప్రయాణికుడి మెడలోని బంగారు గొలుసును తెంపుతాడు. కింద పడిన గొలుసును ముఠా నాయకుడు మక్కన్ ఎంతో చాకచక్యంగా తీసుకొని జేబులో వేసుకుంటాడు. సెకన్ల వ్యవధిలో చోరీ చేసి బస్సు దిగుతారు. తర్వాత బస్సును అనుసరించి వస్తున్న ఆటోలో ఎక్కి మంగార్ బస్తీ చేరతారు.' అని పోలీసులు తెలిపారు.

మహిళలు ఆత్మహత్య పాల్పడతామంటూ బెదిరిస్తారు: బంగారం కొట్టేసిన తర్వాత దాన్ని శాలిబండకు చెందిన రిసీవర్ ప్రవీణ్ రమేశ్​ వర్మకు ఇస్తారని పోలీసులు తెలిపారు. చేతికొచ్చిన సొమ్మును ముఠా నాయకుడు సభ్యులకు పంచుతారని వెల్లడించారు. ముఠాను పట్టుకునేందుకు మంగార్‌ బస్తీకి వెళ్తే వారి ఇంట్లో మహిళలు ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తూ.. చాకచక్యంగా తప్పించుకుంటారని చెప్పారు. బేగంబజార్లో బంగారు నగలు విక్రయించేందుకు సిద్ధమవుతున్న మక్కన్‌, రీసీవర్ ప్రవీణ్ రమేశ్​ వర్మను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.

"మంగార్​ బస్తీ ముఠాపై హైదరాబాద్​లో 20 కేసులు నమోదయ్యాయి. వీళ్లు బంగారంతో బేగం బజారుకి వెళ్లినప్పుడు వారిని పట్టుకున్నాం. ఇలాంటి ముఠాలు చాలా ఉన్నాయి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. జనం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మరింత జాగ్రత్త వహించాలి. ఎవరైనా అనుమానంగా కనిపిస్తే మాకు తెలియజేయాలి."- చక్రవర్తి, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details