Increase registration revenue: స్థిర, చరాస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా ఈ ఏడాది ప్రభుత్వానికి భారీగానే రాబడి వచ్చింది. గతంతో పోల్చితే ఈ ఏడాదే అధిక ఆదాయం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరంభంలో కరోనా పరిస్థితులతో కొంత ఒడిదొడుకులు నమోదైనా క్రమేపీ ఊపందుకుంది. ఎనిమిది నెలల కాలంలో(నవంబరు నాటికి) రూ.7,006.48 కోట్ల ఆదాయం రాగా డిసెంబరు 6వ తేదీ నాటికి రూ.7,258 కోట్లను దాటింది. ఒక్క నవంబరులో రూ.1,138 కోట్లు వచ్చింది. సగటున నెలకు రూ.875 కోట్లు వస్తున్నట్లు అంచనా. 2018-19లో రిజిస్టేషన్ల శాఖ వద్ద నెలకు సగటున 1.26 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యేవి. 2019-20లో నెలకు 1.38 లక్షలు నమోదయ్యాయి. ఈ ఏడాది నెలకు సగటున 1.5 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ అవుతున్నాయి. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి (వచ్చే మార్చి నెలాఖరుకు) రూ.10 వేల కోట్లపైగా ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెరగడంతో..
Increase Immovable property: గతంతో పోల్చితే రాష్ట్రంలో భూముల ధరలు భారీగా పెరిగాయి. కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంతోపాటు పలు ప్రాజెక్టుల కింద సాగునీటి లభ్యత పెరిగింది. దీని వల్ల వ్యవసాయ భూముల ధరలకు ఊపు వచ్చింది. మండల కేంద్రాలు, పట్టణాలు, నగర శివార్లు వేగంగా విస్తరిస్తున్నాయి. దీంతో స్థిరాస్తి రంగానికి రెక్కలొచ్చాయి. సాగు, స్థిరాస్తి రంగాల్లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య గణనీయంగా పెరగడం కూడా రిజిస్ట్రేషన్ల ఆదాయంలో పెరుగుదలకు దోహదం చేసింది.