AR Constable Bhanu Prakash Dismissed: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఆ రాష్ట్ర సీఎం పర్యటన సందర్భంగా ప్లకార్డుతో నిరసన తెలిపిన ఏఆర్ కానిస్టేబుల్ భానుప్రకాశ్‌ను ఉద్యోగం నుంచి అధికారులు తొలగించారు. పోలీసులకు రావాల్సిన బకాయిలపై ప్లకార్డులతో నిరసనలు తెలపడం తప్పా అని నిలదీశారు. ఏం తప్పు చేశానని తనను ఉద్యోగం నుంచి తొలగించారో చెప్పాలని ప్రశ్నించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కారణంగానే కుట్రపూరితంగా తనను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారంటూ ఏఆర్ కానిస్టేబుల్ భానుప్రకాశ్ వాపోయారు. పోలీసులకు రావాల్సిన బకాయిలపై ప్లకార్డులతో నిరసనలు తెలపడం తప్పా? అని నిలదీశారు. ఏం తప్పు చేశానని తనను ఉద్యోగం నుంచి తొలగించారో చెప్పాలని ప్రశ్నించారు. ఇటీవల అనంతపురం జిల్లాకు సీఎం జగన్ వచ్చినరోజు భానుప్రకాశ్ ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఆయన్ను డిస్మిస్ చేసింది.
"కుట్ర పూరితంగానే నన్ను డిస్మిస్ చేశారు. నాకు జరిగిన అన్యాయంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి వెళ్లి ఫిర్యాదు చేస్తా. ఎవరిపైనాలేని అభియోగాలు నాపైనే ఉన్నాయా? ఎస్పీ ఫకీరప్పపై ఆరోపణలు లేవా.. మరి వారిపై చర్యలు తీసుకోరా? పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయాలనుకుంటున్నారా? రూ.లక్షలు వసూలు చేసుకొంటున్న పోలీసులపై చర్యలు శూన్యం. నాకు, నా కుటుంబానికి ప్రాణహాని జరిగితే ఫకీరప్పే కారణం. నిరసన తెలుపుతూ ప్లకార్డు ప్రదర్శించినందుకే డిస్మిస్ చేశారు. పోలీసులకు రావాల్సిన బకాయిలపై ప్రశ్నించడం తప్పా? ఉద్యోగం నుంచి నన్ను తొలగించి ఇబ్బంది పెట్టారు. గోరంట్ల మాధవ్‌పై లేని శిక్షలు నాకే వర్తిస్తాయా? డిస్మిస్ వార్తలు రాగానే ప్రతి కానిస్టేబుల్ నన్ను పరామర్శించారు. నా ఆందోళన వెనుక ఎలాంటి రాజకీయ కుట్రలేదు. మాకు రావాల్సిన బకాయిలపైనే నేను ప్రశ్నించా. నాకు న్యాయం జరిగే వరకు పోరాడతా" -భానుప్రకాశ్, ఏఆర్ కానిస్టేబుల్
అసలేం జరిగిందంటే:సీఎం జగన్ జూన్ 14న సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అనంతపురం పోలీసు అమరవీరుల స్మారక స్థూపం వద్ద ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్.. ‘సరెండర్ లీవులు, అదనపు సరెండర్‌ల లీవుల సొమ్ములు ఇప్పించండి.. సీఎం సార్ ప్లీజ్’ అన్న ప్లకార్డును ప్రదర్శించి నిరసన తెలిపారు. ఆ తర్వాత నుంచే అతనిపై వేధింపులు పెరిగాయని, ప్రతి కదలికపై నిఘా పెట్టారని ప్రకాశ్ సంబంధీకులు ఆరోపిస్తున్నారు. అతని వ్యక్తిత్వాన్ని హననం చేసేలా దుష్ప్రచారం చేస్తున్నారని, పాత కేసుల్ని తెరపైకి తెస్తున్నారని చెబుతున్నారు.