తెలంగాణ

telangana

ఆన్​లైన్ క్లాసులపై దాగుడు మూతలొద్దు.. ప్రభుత్వంపై హైకోర్టు అసహనం

By

Published : Jul 3, 2020, 1:05 PM IST

Updated : Jul 3, 2020, 5:14 PM IST

high court hearing on online clasess
దాగుడు మూతలు ఆడుతున్నారా: ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

13:01 July 03

ఆన్​లైన్ క్లాసులపై దాగుడు మూతలొద్దు.. ప్రభుత్వంపై హైకోర్టు అసహనం

పాఠశాలల్లో ఆన్​లైన్ తరగతులపై ప్రభుత్వం ద్వంద్వ వైఖరితో దాగుడు మూతలు ఆడవద్దని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.  ఆన్​లైన్ తరగతులపై స్పష్టమైన విధానం ఎందుకు తీసుకోవడం లేదని మరోసారి ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం, సీబీఎస్​ఈ వాదనలు కూడా వింటామని హైకోర్టు పేర్కొంది. ఢిల్లీలో ఏసీ గదుల్లో కూర్చుని నిర్ణయాలు తీసుకోవద్దని.. మారుమూల ప్రాంతాల్లోని క్షేత్రస్థాయిలో పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకోవాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.  

ప్రైవేటు పాఠశాలల్లో ఆన్​లైన్ తరగతులను నిషేధించాలంటూ హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్​ఎస్​ చౌహాన్,  జస్టిస్ విజయ్ సేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. విద్యా సంవత్సరం ప్రారంభంపై ఈ నెలాఖరు తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. జులై 31 వరకు పాఠశాలలు, కళాశాలలు ఇతర విద్యా సంస్థలు తెరవొద్దని కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది సంజీవ్ కుమార్ వివరించారు.  

కేబినెట్ సబ్ కమిటీ అధ్యయనం తర్వాతే నిర్ణయం

ఆన్​లైన్ తరగతులపై కేబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.  విద్యా సంవత్సరంలో 180 రోజులు ఉండాలని దానికనుగుణంగా తగిన నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొంది. అయితే విద్యా సంవత్సరం మొదలు పెట్టకుండానే ఆన్​లైన్ తరగతులను ఎలా అనుమతిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. పాఠశాలల్లో ఆన్​లైన్ తరగతుల నిర్వహణకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఓవైపు అనుమతి ఇవ్వలేదు అంటున్నారని.. మరోవైపు ఆన్​లైన్  తరగతులను ఆపడం లేదని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ధ్వంద్వ  వైఖరితో దాగుడు మూతలు ఆడకూడదని వ్యాఖ్యానించింది.  మహారాష్ట్ర మాదిరిగా  స్పష్టమైన నిర్ణయం ఎందుకు తీసుకోలేరని హైకోర్టు ప్రశ్నించింది. విద్యార్థుల ఇబ్బందులను పరిష్కరించాలని హైకోర్టు స్పష్టం చేసింది.  

విద్యార్థుల కెరీర్ స్తంభిస్తుంది

సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పాఠశాల తరఫున ఇండిపెండెంట్ స్కూల్ మేనేజ్ మెంట్స్ అసోసియేషన్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థుల కెరీర్  దృష్టిలో ఉంచుకొని ఆన్​లైన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఇస్మా తరఫు న్యాయవాది తెలిపారు. సీబీఎస్ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆన్​లైన్  బోధన చేస్తున్నామని.. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పాఠశాలకు రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం ఉండదని వాదించారు. అయితే ఆన్​లైన్ తరగతులకు కచ్చితంగా హాజరు కావాలని ఒత్తిడి తేవడం లేదన్నారు. ఆన్​లైన్ తరగతులు నిర్వహించకపోతే విద్యార్థుల కెరీర్ స్తంభిస్తుందని అన్నారు.  

ప్రపంచం అంతా విపత్కర పరిస్థితుల్లో ఉంది

ప్రపంచం అంతా విపత్కర పరిస్థితుల్లో ఉందని వలస కార్మికులు, న్యాయ వ్యవస్థతోపాటు మానవాళి జీవితాలన్నీ కూడా స్తంభించాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒక ఇంట్లో ఇద్దరు, ముగ్గురు విద్యార్థులు ఉంటే.. రెండు మూడు ల్యాప్ టాప్ లు కొనే శక్తి ఉంటుందా అని హైకోర్టు ప్రశ్నించింది. అదేవిధంగా అన్ని ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటుందా అని పేర్కొంది. నల్సార్ న్యాయ విశ్వ విద్యాలయంలోనే సరైన  ఇంటర్నెట్ సదుపాయం లేదని హైకోర్టు పేర్కొంది.  

గిరిజన, మారుమూల ప్రాంతాలను దృష్టిలో ఉంచుకోవాలి

దీల్లీలో ఏసీ గదుల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకోవద్దని.. గిరిజన, మారుమూల ప్రాంతాల్లోని క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం, సీబీఎస్ ఈ వాదనలు కూడా వినాలనుకుంటున్నామని ధర్మాసనం పేర్కొంది. కేంద్రం, సీబీఎస్ఈ, ఎన్​సీఈఆర్​టీని కూడా ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్​ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 13కి వాయిదా వేసింది.

ఇదీ చూడండి:ఈనాడు, ఈటీవీ భారత్ కథనానికి స్పందన... నగరానికి వచ్చేస్తున్న బామ్మ

Last Updated : Jul 3, 2020, 5:14 PM IST

ABOUT THE AUTHOR

...view details