కొండపోచమ్మ రిజర్వాయర్ ముంపువాసులకు గజ్వేల్లోని రెండు పడక గదుల ఇళ్లలో తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసి అక్కడ నుంచి శాశ్వత ఇళ్ల నిర్మాణం జరుగుతున్న ప్రాంతాలకు లాక్‌డౌన్ సమయంలో రవాణా సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వీటితో పాటు ప్రస్తుతం ఎన్ని డబుల్ బెడ్‌రూం గదులు ఖాళీ ఉన్నాయి. ఎన్ని ముంపు వాసులకు కేటాయించారు, అందుబాటులో ఉన్నవి, పునరావాస ఇళ్ల నిర్మాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. పునరావాసం, పునర్నిర్మాణం సౌకర్యాలు కల్పించడకుండా ఖాళీ చేయించడాన్ని సవాలు చేస్తూ... మామిడ్యాల, బహిలాంపూర్ గ్రామస్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ ఎస్ చౌహాన్, జస్టిస్ అబిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది.
నిర్వాసితులు నిరాకరిస్తున్నారు : ఏజీ
ఈ సందర్భంగా గత ఆదేశాల మేరకు బాధితుల నుంచి సీఆర్‌పీసీ సెక్షన్ 164 కింద నమోదు చేసిన వాంగ్మూలాలను అదనపు జిల్లా జడ్జి హైకోర్టుకు పంపారు. ఆర్డీవో, కలెక్టర్‌లు బలవంతంగా ఖాళీ చేయించారన్నదానిపై వాంగ్మూలాలు నమోదు చేశారు. కొంత మందికి ములుగు మండలంలో డబుల్ బెడ్ రూంలు కేటాయించామని, గజ్వేల్లోని డబుల్ బెడ్ రూంల ఇళ్లలోకి వెళ్లడానికి నిర్వాసితులు నిరాకరిస్తున్నారని ఏజీ బీఎస్ ప్రసాద్, ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్‌లు వాదనలు వినిపించారు. బహిలాంపూర్‌లో కేవలం 4 కుటుంబాలు ఉండటం వల్ల వారికి ములుగులో డబుల్ బెడ్‌రూంలు కేటాయించామని, మిగిలినవారికి గజ్వేల్లో కేటాయించామని పేర్కొన్నారు. నిర్మాణాలు సగంలో ఉన్నాయని, అందువల్ల అందుబాటులో ఉన్న సింగిల్ బెడ్ రూంలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామనగా... ధర్మాసనం జోక్యం చేసుకుంటూ కుటుంబం మొత్తం సింగల్ బెడ్‌రూంలలో ఎలా ఉండాలని ప్రశ్నించింది.