Azharuddin on ind aus match tickets మూడేళ్ల తర్వాత హైదరాబాద్‌కు దక్కిన అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ నిర్వహణలో హెచ్‌సీఏ వైఫల్యం అడుగడుగునా కనిపిస్తోంది. టికెట్ల జారీ నుంచే గందరగోళానికి తెరలేపిన అసోసియేషన్ పెద్దలు... అభిమానులను అసహనానికి గురిచేస్తున్నారు . అభిమాన క్రికెటర్ల ఆటను మైదానంలో ప్రత్యక్షంగా వీక్షిద్దామన్న సగటు ప్రేక్షకులను నిరాశకు గురిచేస్తున్నారు. ఇంత గందరగోళం జరుగుతున్నా అంతా సవ్యంగానే ఉందంటూ సముదాయిస్తున్నారు . టికెట్ల పంపిణి అవతకతవకలను హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. టికెట్ల అమ్మకంలో హెచ్‌సీఏకు ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారు. బ్లాక్‌లో విక్రయించలేదని చెబుతూనే... అలాంటివి జరిగితే చర్యలు తప్పవంటూ చెప్పుకొచ్చారు.
టికెట్ల అమ్మకాలకు సంబంధించి హెచ్సీఏకు సంబంధం లేదు. టికెట్ల అమ్మకాలు పేటీయంకు అప్పగించాం. టికెట్ల అమ్మకాల విషయంలో పేటియం అద్భుతంగా పని చేసింది. టికెట్లు ఆన్‌లైన్‌లో అమ్మకాలు జరిపాం... బ్లాక్‌లో అమ్మలేదు. బ్లాక్‌లో టికెట్లు అమ్మినట్లు విచారణ తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. మేము స్టేడియంలో ఏర్పాట్ల నిర్వహణలో బిజీగా ఉన్నాం. - అజారుద్దీన్, హెచ్‌సీఏ అధ్యక్షుడు
హెచ్‌సీఏ కార్యదర్శి విజయానంద్ మాత్రం మ్యాచ్ విజయవంతం కోసం కృషి చేస్తున్నామని వివరించారు. పూర్తి అధికారాలు తమకు లేవన్న విజయానంద్... అసోసియేషన్‌లో విబేధాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. చిన్న,చిన్న తప్పిదాలు జరిగాయని అంగీకరించిన ఆయన...తొక్కిసలాటలో గాయపడ్డవారికి హెచ్‌సీఏ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.