హనుమాన్ జయంతి సందర్భంగా జంట నగరాల్లో.. శోభాయాత్రలు వైభవంగా సాగాయి. జై హనుమాన్.. జై శ్రీరామ్.. అంటూ భక్తుల నినాదాల మధ్య సుమారు 12 కిలోమీటర్ల యాత్ర అట్టహాసంగా కొనసాగింది. గౌలిగూడ రామ మందిరం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర.. కోఠి, కాచిగూడ, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, అశోక్‌నగర్, గాంధీ నగర్ మీదుగా తాడ్‌బండ్ ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుంది. దారి పొడవునా.. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని రామనామంతో హోరెత్తించారు. కర్మన్‌ఘాట్ నుంచి తాడ్‌బండ్ వరకు సాగిన మరో శోభాయాత్ర వైభవంగా సాగింది. నగరంలో గల్లీ గల్లీలో యువకులు వాహనాలకు కాషాయం జెండాలు కట్టుకుని.. ర్యాలీలతో సందడి చేశారు.
జిల్లాల్లోనూ..
జిల్లాల్లోనూ రహదారులు కాషాయవర్ణంతో కళకళలాడాయి. మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శోభాయాత్రలో పాల్గొన్నారు. కరీంనగర్లో హనుమాన్ భక్తి పాటలతో హోరెత్తుతూ సాగిన యాత్రలో.. మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో వీర హనుమాన్ విజయ యాత్ర వైభవంగా నిర్వహించారు. బోధన్‌లో భజరంగ్ దళ్ నిర్వహించిన వేడుకలో.. ఎంపీ అర్వింద్ తోటి భక్తులతో కలిసి ఆడిపాడారు. నల్గొండలో హనుమాన్ విజయోత్సవ ర్యాలీలో యువత నృత్యాలతో హోరెత్తించారు. వరంగల్‌లోని మహంకాళి ఆలయం నుంచి హనుమకొండలోని పద్మాక్షి ఆలయం వరకు సాగిన శోభాయాత్రలో.. పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు.