తెలంగాణ

telangana

By

Published : Jul 17, 2019, 5:13 PM IST

Updated : Jul 17, 2019, 7:24 PM IST

ETV Bharat / state

'రిజిస్ట్రేషన్లతో కళకళ.. ఖజానా గలగల..'

వ్యవసాయ, స్థిరాస్తి రంగాల్లో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి ఈ ఏడాది భారీ ఆదాయం సమకూరింది. సర్కారు నిర్దేశించిన లక్ష్యాలను మించి దాదాపు రూ. 12 వందల కోట్లు అదనంగా వసూలైంది. వ్యవసాయం కంటే వ్యవసాయేతర లావాదేవీల్లోనే ఎక్కువ రాబడి జరగడం రియల్టీ రంగం జోరును సూచిస్తోంది.

రిజిస్ట్రేషన్ల వ్యవహారం... ప్రభుత్వానికి భారీ ఆదాయం

రిజిస్ట్రేషన్ల వ్యవహారం... ప్రభుత్వానికి భారీ ఆదాయం

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి ఈ ఏడాది భారీ ఆదాయం సమకూరింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యానికి మించి రూ. 12 వందల కోట్లు అదనంగా వసూలైంది. వ్యవసాయ రిజిస్ట్రేషన్లతో పోలిస్తే స్థిరాస్తి వ్యాపార లావాదేవీల రిజిస్ట్రేషన్లు నాలుగు రెట్లు అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. ప్రభుత్వం సూచించిన మార్కెట్​ విలువ కంటే ఎక్కువ విలువకు డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్​ చేయడం ద్వారా అధిక రాబడి వచ్చినట్లు ఆ శాఖ వెల్లడించింది.

లక్ష్యానికి మించి రాబడి...

2016-17 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.4,249 కోట్ల ఆదాయం సమకూరగా... తర్వాత ఏడాది రూ. 5,176 కోట్లు వసూలయ్యాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో వివిధ పద్దుల కింద రూ. 5,400 కోట్లు రావాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. అయితే అంచనాలను మించి రూ. 6,612 కోట్లు ఖజానాకు చేరాయి.

వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లే ఎక్కువ

ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ పరంగా 3.62 లక్షల డాక్యుమెంట్ల ద్వారా 3.21 లక్షల ఎకరాలకు లావాదేవీలు జరిగాయి. స్థిరాస్తి వ్యాపారాల్లో భాగంగా 6.13 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు చేయడం ద్వారా 13.87 లక్షల ఎకరాల వ్యవసాయేతర లావాదేవీలు జరిగాయి. ప్రభుత్వం ఈ రెండింటి మార్కెట్​ విలువను రూ. 58,117 కోట్లుగా నిర్ణయించగా... తమకున్న విచక్షణాధికారాలతో అధికారులు రూ.23,441 కోట్లు ఎక్కువ మొత్తాన్ని విలువ కట్టి చూపారు. దీని వల్ల ఖజానాకు రూ. 6,612 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు.

వ్యవసాయ రిజిస్ట్రేషన్లలో మెదక్​ మొదటి స్థానం

రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ రిజిస్ట్రేషన్లలో మెదక్​ మొదటి స్థానంలో నిలవగా రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్​నగర్​, వరంగల్​, కరీంనగర్​, మేడ్చల్​ జిల్లాలు తరువాత స్థానంలో నిలిచాయి. స్థిరాస్తి వ్యాపార రిజిస్ట్రేషన్లలో రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా జరగ్గా... నల్గొండ, మెదక్​, మేడ్చల్​, కరీంనగర్​ తరువాత స్థానాన్ని ఆక్రమించాయి.

ఇదీ చూడండి : 'ఉద్యమకారుడే సీఎం కావడం వల్ల చేకూరిన లబ్ధి ఇది!'

Last Updated : Jul 17, 2019, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details