Nara Lokesh Fires on YCP: ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యామ్నాయం చూపకుండా ఫ్లెక్సీలపై నిషేధం విధించడంతో లక్షలాది మంది కుటుంబాలతో నడిరోడ్డున పడ్డారని.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ప్రింటింగ్ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న యజమానులు, ఉద్యోగులు, కార్మికులకు ఇచ్చిన హామీలను సీఎం నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఫ్లెక్సీలు తయారు చేసే యూనిట్లపై ఆధారపడి జీవిస్తున్న వారితో కనీసం చర్చించకుండా.. ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించి జీవో నెంబర్ 65 తీసుకురావడం అనాలోచిత చర్యేనని లోకేశ్ మండిపడ్డారు.
ఫ్లెక్సీ ప్రింటర్‌ను క్లాత్ ప్రింటర్ మిషన్‌గా అప్‌గ్రేడ్ చేసుకునేందుకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం హమీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ ఇచ్చిన హామీ మరిచిపోవడంతో, బ్యాంకర్లు లోన్లు ఇవ్వడంలేదని నారా లోకేశ్ అన్నారు. ఫ్యాబ్రిక్ క్లాత్ అందుబాటులో లేదని, మిషన్ల అప్‌గ్రేడ్‌కి అవకాశంలేదని.. ఇటువంటి పరిస్థితిలో నిషేధానికి మరింత సమయం ఇవ్వాలని కోరుతున్న ఫ్లెక్స్ యూనియన్ డిమాండ్‌ని సానుకూలంగా పరిశీలించాలని కోరారు. మానవతా దృక్పథంతో ఆలోచించి సీఎం ఇచ్చిన హామీ మేరకు మిషన్ల అప్‌గ్రేడ్ చేసుకోవడానికి బ్యాంకు రుణాలు ఇప్పించాలని చెప్పారు. ఫ్యాబ్రిక్ క్లాత్ అందుబాటులోకి తెప్పించి.. తగిన శిక్షణ ఇచ్చిన తరువాతే ఫ్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధం విధిస్తే బాగుంటుందని లోకేశ్ పేర్కొన్నారు.