దేశంలోనే తొలిసారిగా చట్టబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్దేశిత కాలంలో అన్ని రకాల అనుమతులు పొందడానికి పారిశ్రామికవేత్తలకు హక్కులు కల్పిస్తూ, జాప్యం చేస్తే నేరుగా అనుమతులు పొందే అవకాశం ఇస్తూ, నిర్లక్ష్యం వహించిన వారికి జరిమానాలు విధించేలా రూపొందించిన తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అనుమతులు, స్వీయధ్రువీకరణ విధానం (టీఎస్‌ఐపాస్) బుధవారం ఆరో ఏట అడుగిడుతోంది. ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం శిల్పకళావేదికలో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తోంది. 2014 డిసెంబరు నాలుగో తేదీన టీఎస్ చట్టం అమల్లోకి వచ్చింది. 2015 జూన్ 12న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఆన్‌లైన్ అనుమతుల ప్రక్రియ మొదలైంది.
ఇవీ ప్రత్యేకతలు
- పారిశ్రామిక అనుమతులు పొందే హక్కు; దరఖాస్తుదారు స్వీయ ధ్రువీకరణ ఆధారంగా ఆమోదాలు.
- అన్ని విభాగాలకు కలిపి 35 సేవల కోసం ఒకే సంయుక్త దరఖాస్తు ఫారం.
- ఆన్‌లైన్‌లో నమోదు అనుమతుల ప్రక్రియ... 15 రోజుల్లోపు అనుమతులు.
- రూ. 200 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి గల ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని టి-స్విఫ్ట్ బోర్డు.
- నిర్ణీత కాలంలో అనుమతులు ఇవ్వకుంటే అధికారులకు రోజుకు రూ .1,000. అలా 25 రోజులు జాప్యం జరిగితే రూ. 25 వేల వరకు జరిమానా.
- గడువులోగా అనుమతులు రాకపోతే నేరుగా పొందినట్లు ఆమోదం.
- తప్పుడు సమాచారం ఇస్తే పారిశ్రామికవేత్తలకు జరిమానా; ప్రభుత్వ అనుమతులు పొందిన తర్వాత రెండేళ్లలో పరిశ్రమను ప్రారంభించకపోతే భూముల స్వాధీనం