రాష్ట్ర ప్రభుత్వం కొత్త బడ్జెట్‌కు సిద్ధమవుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2020-21 బడ్జెట్ అంచనాల కోసం ప్రతిపాదనలు పంపాల్సిందిగా అన్ని శాఖలను ఆర్థిక శాఖ ఇప్పటికే కోరింది. ఈ నెల తొమ్మిదో తేదీతో ఆ గడువు ముగియనుంది. ఆర్థికమాంద్యం ప్రభావంతో ఆదాయం గణనీయంగా పడిపోవటమే కాకుండా... కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తగ్గాయి. భూముల అమ్మకం ద్వారా రూ. పది వేల కోట్లు రాబట్టుకోవాలన్న ప్రణాళికలూ ఫలించలేదు. అయినప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉందని, పూర్తి స్థాయి బడ్జెట్ అయిన రూ.లక్షా 36వేల కోట్ల మార్కును అటూఇటూ చేరుకుంటామని ప్రభుత్వ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.
ఊహాగానాలు ఉండొద్దు...
సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆధారంగానే ప్రతిపాదనలు ఇవ్వాలని ఆర్థికశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. పూర్తిస్థాయిలో వాస్తవ అవసరాలకు అనుగుణంగానే అంచనాలు రూపొందించాలని కూడా సూచించింది. ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషించాలని అన్ని శాఖల అధిపతులను కోరింది.