భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సుపరిపాలనా వేదిక(FGG) కార్యదర్శి పద్మనాభ రెడ్డి డిమాండ్ చేశారు. శ్వేతపత్రం విడుదల చేసేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు ఇవ్వాలని... గవర్నర్‌కు రాసిన లేఖలో కోరారు. రెండు ప్లాంట్లకు కలిపి రూ.40వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని... సకాలంలో నిర్మాణం పూర్తి చేయకపోవడం వల్ల ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణం కోసం జెన్‌కో(GENCO) ఉపయోగించిన సాంకేతికత విషయంలో కేంద్రం అభ్యంతరం చెప్పిందని అన్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు భేఖాతరు చేయడంతో ఇద్దరు ఇంజినీర్లపైనా కేసులు నమోదయ్యాయని పద్మనాభరెడ్డి తెలిపారు. 1080 మెగావాట్ల సామర్థ్యంతో రూ.7290కోట్లతో 2015లో భద్రాద్రి థర్మల్ ప్లాంటు పనులు ప్రారంభించినా.... 2021లో పూర్తయ్యాయని.. ఖర్చు రూ.10వేల కోట్లకు చేరుకుందని పేర్కొన్నారు.