ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు... రైతులకు కష్టాలు తప్పట్లేదు. అకాల వర్షాలకు నష్టపోకుండా కొనుగోళ్లు వేగవంతం చేయాలని అన్నదాతలు మెురపెట్టుకున్నా ఉన్నతాధికారులు పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. చేసేది లేక కర్షకులు ఆందోళనలకు దిగారు. మహబూబాబాద్ జిల్లా ఉప్పరపల్లిలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళనకు నిర్వహించారు, ధాన్యం బస్తాలను రహదారిపై వేసి నిరసన తెలిపారు. ఇనుగుర్తిలోని అంబేడ్కర్ సెంటర్‌లో ధాన్యానికి నిప్పుపెట్టారు. కాంటాలు వేసిన బస్తాలను మిల్లులకు తరలించాలని నినాదాలు చేశారు. అకాల వర్షాలకు ధాన్యం బస్తాలు తడిసి మొలకలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.
20 రోజుల కిందట ధాన్యం తెచ్చినా కొనలేదు
యాదాద్రి జిల్లా బీబీనగర్, వలిగొండ, భువనగిరిలో వర్షం ధాటికి ధాన్యం తడిసిపోయింది. కొనుగోళ్లు వెంటనే చేసిఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని రైతులు వాపోయారు. తడిచిన ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా పానుగల్‌లోనూ రైతులు ధర్నాకు దిగారు. 20 రోజుల కిందట ధాన్యం తెచ్చినా కొనకపోవడం వల్లే ధాన్యం తడిచిందని మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా అప్పనపేట గ్రామంలోని ఐకేపీ కేంద్రం వద్ద రాజీవ్ రహదారిపై బైఠాయించి అన్నదాతలు రాస్తారోకో చేశారు. తేమశాతం అధికంగా ఉందంటూ 5కిలోల వరకు కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.