Cotton Crop: మార్కెట్‌లోకి పత్తి పంట రికార్డుస్థాయిలో రావడంతో వచ్చే వానాకాలంలో ఈ పంటపై ప్రయోగానికి వ్యవసాయశాఖ రంగం సిద్ధం చేస్తోంది. పత్తి తోటల్లో కూలీలతో దూది తీయడంలో వ్యయప్రయాసలు అధికంగా ఉన్నందున యంత్రాలతో తోటలోనే ఒకేసారి దూదిని తీసి పంటను ముగించేలా పైలెట్ ప్రాజెక్టు చేపడుతోంది. యంత్రాల లభ్యతను అంచనా వేసుకుని, వేలాది ఎకరాల్లో యంత్ర ప్రయోగాత్మక సాగుకు ఏర్పాట్లు చేస్తోంది. రైతులకు ఖర్చులు తగ్గించి, ఆదాయం పెంచాలనేది దీని లక్ష్యం. రాష్ట్రంలో జూన్ ఆరంభంలో తొలకరి వర్షాలు పడగానే పత్తి విత్తనాలు నాటడం ప్రారంభమవుతుంది. ఒక పొలంలో పత్తిసాగు చేస్తే, అక్టోబరు నుంచి ఫిబ్రవరి వరకు లేదా మార్చి వరకు.. 2, 3 సార్లు దూది తీయడం ఆనవాయితీ. ఇందుకు కూలీల అవసరం చాలా ఎక్కువగా ఉంటోంది. పైగా పంట అంతకాలం కొనసాగడం వల్ల ఆ కమతంలో నవంబరు నుంచి యాసంగిలో రెండో పంట వేయడానికి సాధ్యం కాదు.
ఎన్నో లాభాలు..
పలు దేశాల్లో పత్తి తోటలో ఒకసారి మాత్రమే యంత్రంతో దూది తీసి, తరువాత తోటను తొలగించి రెండోపంట వేస్తున్నారు. ‘సింగిల్ పికింగ్’ పద్ధతిగా పిలిచే దీనివల్ల అనేక లాభాలున్నాయి. కూలీలతో దూది తీయిస్తే క్వింటాకు రూ.వెయ్యి చొప్పున ఖర్చవుతుంది. యంత్రంతో దూది తీస్తే ఎకరం కేవలం 2 నుంచి 3 గంటల్లో పూర్తవుతుందని, అదే కూలీలు దొరక్కపోతే రోజుల తరబడి ఆలస్యమవుతుందని వ్యవసాయశాఖ అధ్యయనంలో తేలింది. ఇప్పటికే కొన్ని ప్రైవేటు కంపెనీలు ఇతర రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా సింగిల్ పికింగ్ పత్తి సాగు చేయిస్తున్నాయి. గతంలో వరికోతలను కూలీలతో చేయించినప్పుడు రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు యంత్రాలతో ఎకరం వరిచేనులో కోత గంటా రెండు గంటల్లో పూర్తవుతోంది. ఇలాగే పత్తి దూది తీయడాన్ని పూర్తిగా యాంత్రీకరణ చేస్తే రాష్ట్రానికి అనేక లాభాలున్నాయని వ్యవసాయశాఖ చెబుతోంది.