రాష్ట్ర పురపాలక ఎన్నికల్లో రియల్‌ఎస్టేట్ వ్యాపారుల దూకుడు కొనసాగుతోంది. పురపాలక పదవులను దక్కించుకునేందుకు భారీ సంఖ్యలో స్థిరాస్తి వ్యాపారులు రంగంలోకి దిగారు. పరోక్షంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులకు మద్దతుగా నిలుస్తున్న రియల్టర్లు ఈ సారి ఎన్నికల బరిలో దిగారు. రాజకీయంగా ఎదిగేందుకు... వ్యాపారాలను పదిలం చేసుకునేందుకు ఇదో అవకాశంగా వారు భావిస్తున్నారు. మేయర్, ఛైర్‌పర్సన్ పదవులు దక్కించుకునేందుకు వందల మంది నామినేషన్లు వేశారు. హైదరాబాద్ మహానగరం చుట్టూ ఉన్న ఏడు నగరపాలక సంస్థలు, 21 పురపాలక సంఘాలతో పాటు జిల్లాల్లో కొత్త మున్సిపాలిటీల్లో పదవులపై వీరు ఎక్కువగా దృష్టి సారించారు. ఈ ప్రాంతాల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 70 శాతం మంది వీరే.
కొత్త మున్సిపాలిటీల్లో పోటాపోటీ...
మేయర్, ఛైర్‌పర్సన్ పదవి కోసం రూ.కోట్లు వ్యయం చేసేందుకు సిద్ధమని స్థిరాస్తి వ్యాపారులు ముందుకు వస్తుండటం వల్ల పార్టీలు వారివైపే మొగ్గుచూపుతున్నాయి. ప్రధానంగా అనుమతులు, వెంచర్లు వేసినపుడు సహా అనేక సందర్భాల్లో ఇబ్బందులు వస్తున్నాయి... తామే పదవి దక్కించుకుంటే వ్యాపారానికి సమస్య ఉండదనే కుటుంబసభ్యులను బరిలో దింపినట్లు శివారు నగరపాలక సంస్థ మేయర్ పదవిపై దృష్టిసారించిన స్థిరాస్తి వ్యాపారి తెలిపారు. ఎన్నికల్లో భారీగా వ్యయం చేయాల్సి ఉందని, కొన్ని చోట్ల వార్డులకు రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల దాకా కూడా ఖర్చు చేస్తారని, ఇలాంటి పరిస్థితుల్లో స్థిరాస్తి వ్యాపారులు కాకుండా ఇతరులపై ఆధారపడలేమని పార్టీ నేత ఒకరు స్పష్టం చేయడం గమనార్హం. టికెట్ దక్కించుకునేందుకే ఏకంగా రూ.85లక్షల వరకు వెచ్చించానని ఓ స్థిరాస్తి వ్యాపారి బాహాటంగా చెబుతుండటం విశేషం.