రాష్ట్రంలోని పుర, నగరపాలక ఎన్నికలకు నామినేషన్లు పోటేత్తాయి. 9 కార్పోరేషన్లు, 120 మున్సిపాల్టీల్లో వార్డు సభ్యుల ఎన్నికకు నిన్నటి వరకు నామపత్రాలు స్వీకరించారు. 325 కార్పొరేటర్, 2727 కౌన్సిలర్ డివిజన్లకు మొత్తం 21 వేల 850 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు కావడం వల్ల శుక్రవారం ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో అభ్యర్థులు బారులు తీరారు. సాయంత్రం ఐదు గంటల వరకూ ఎన్నికల కార్యాలయంలోకి వచ్చిన అభ్యర్థులందరికీ టోకెన్లు ఇచ్చి రాత్రి దాకా నామినేషన్లు స్వీకరించారు. శుక్రవారం నాడు 16 వేల 161 నామినేషన్లు దాఖలయ్యాయి.
రంగారెడ్డిలో అత్యధికంగా..
రాష్ట్రంలో అత్యధికంగా పట్టణ స్థానిక సంస్థలున్న రంగారెడ్డి జిల్లాలో 2, 392 నామినేషన్లు వచ్చాయి. ఆ తర్వాత 13 పురపాలక సంఘాలు, కార్పొరేషన్లు ఉన్న మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 1910 నామినేషన్లు నమోదయ్యాయి. ఇంకా నల్గొండ జిల్లాలో 1,533, పెద్దపల్లిలో 1,128 సూర్యాపేటలో 1,073, నిజామాబాద్ కార్పొరేషన్, జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో 1,043, సంగారెడ్డిలో 981, మంచిర్యాలలో 910, జగిత్యాల జిల్లాలో 904 నామపత్రాలు దాఖలయ్యాయి. అయితే అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 134 నామినేషన్లు నమోదు అయ్యాయి.
పురపాలక ఎన్నికల నామినేషన్ల పరిశీలన ఇవాళ జరగనుంది. చెల్లుబాటైన వాటి జాబితాను ప్రకటించనున్నారు. అభ్యర్థులు బీ-ఫాంలను ఈనెల 14న సాయంత్రం మూడు గంటల్లోపు దాఖలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది. పార్టీల తరఫున బరిలో దిగిన వారు వీటిని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేయాలని స్పష్టం చేసింది.
ఎవరి నామినేషన్లైనా తిరస్కరణకు గురైతే ఆ అభ్యర్థులు రేపు జిల్లా ఎన్నికల అధికారి, అదనపు, ఉప జిల్లా ఎన్నికల అధికారులు లేదా వారు ధృవీకరించిన అధికారుల వద్ద అప్పీల్ చేసుకోవచ్చు. అటు కరీంనగర్ కార్పోరేషన్లోని 60 డివిజన్లకు ఇవాళ రెండో రోజు నామినేషన్లు స్వీకరించనున్నారు.
ఇవీ చూడండి: పురపోరుకు 21,850 నామినేషన్లు.. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో..