లాక్‌డౌన్ చేనేత, జౌళి రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో 40,533 కుటుంబాలు చేనేత, 35,762 కుటుంబాలు మరమగ్గాల నేత పనుల్లో ఉన్నాయి. 615 సంఘాల పరిధిలో వీరు పనిచేస్తున్నారు. మరో అయిదువేల కుటుంబాలు అసంఘటిత రంగంలో ఉన్నాయి. ఈ కుటుంబాలకు రెక్కాడితే కాని డొక్కాడదు. టెస్కో నుంచి నూలు తెచ్చి, కార్మికులతో వస్త్రాలను తయారు చేయిస్తూ వారికి చేనేత సహకార సంఘాలు వేతనాలు చెల్లిస్తున్నాయి. ప్రభుత్వ శాఖలకు దుస్తులు, దుప్పట్లు, ఇతర వస్త్రాలను టెస్కో ద్వారా సంఘాలు విక్రయిస్తున్నాయి. రాష్ట్రంలో మార్చి మొదటి వారం వరకు చేనేత సంఘాలు నడిచాయి. కొనుగోళ్లు జరిగాయి. లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో సంఘాలన్నీ మూతపడ్డాయి.
రెండు నెలల నిల్వలు పేరుకుపోయాయి. దీంతో పనులు లేక కార్మికులు ఇబ్బందిపడుతున్నారు. ప్రభుత్వ రేషన్ అందినా కుటుంబ పోషణ భారంగా ఉందని పలువురు వాపోతున్నారు. పోచంపల్లి, గద్వాల, కొత్తవాడ, నారాయణపేట, కొయ్యలగూడెం, జమ్మికుంట తదితర ప్రాంతాల్లోని కార్మికులు సొంతంగా గుంట మగ్గాలపై నేసే చీరలూ వారి ఇళ్లలోనే ఉండిపోయాయి. మూడో వారం నుంచి నూలు అమ్మకాలు నిలిచిపోవడంతో వాటి తయారీ కూడా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వ బతుకమ్మ చీరల పంపిణీ పథకం ద్వారా సిరిసిల్ల తదితర ప్రాంతాల్లోని మరమగ్గాల కార్మికులకు ఉపాధి లభించింది. గత మూడేళ్లుగా ఏటా రూ.320 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ ఏడాది ప్రభుత్వం నిధులను కేటాయించగా జనవరి నుంచే పనులు ప్రారంభమయ్యాయి. మార్చి మూడో వారం వరకు 30 శాతం ఉత్పత్తి పూర్తయింది. లాక్‌డౌన్ నిబంధనలతో కార్ఖానాలను మూసి వేయడంతో పనులు నిలిచిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 42 జౌళి, దుస్తుల తయారీ పరిశ్రమలు, 150 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా గార్మెంట్ పరిశ్రమల్లో పనిచేస్తున్న 40 వేల మందికి పైగా కార్మికులూ ఇబ్బంది పడుతున్నారు. కరోనా సమస్య వల్ల ఈ పరిశ్రమలను మూసివేశారు. వేతనాలు చెల్లించే పరిస్థితి వీటికి లేదని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
లాక్‌డౌన్‌తో కార్పెట్లు, దుప్పట్ల తయారీ పనులు నిలిచిపోయాయి. ఒక్క వరంగల్ నగరంలోనే రెండు వేల మంది చేనేత కార్మికులకు ఉపాధి పోయింది. మూడు నెలలుగా మా సంఘాల్లో ఉన్న నిల్వలను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలి..
- ఎలుగం భద్రయ్య, కొత్తవాడ ధనలక్ష్మి చేనేత సహకార సంఘం అధ్యక్షుడు
మాస్క్‌ల తయారీ మాకే అప్పగించాలి