కరోనా కారణంగా పాఠశాలలు మూతపడినా నిరంతరం పాఠాలు వినేందుకు, చదువుకునేందుకు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ డిజిటల్ గ్రంథాలయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలుత 9, 10 తరగతుల కోసం డిజిటల్ పాఠాలు తీసుకువచ్చారు. విద్యార్థులు https://deohyd.telangana.gov.inవెబ్‌సైట్‌లోకి వెళ్లి నేరుగా తమ తరగతులకు సంబంధించి సబ్జెక్టుల పాఠాలు వినవచ్ఛు ప్రభుత్వ, ప్రైవేటు విభాగంలో మొత్తంగా 1.32 లక్షల మంది వినియోగించుకునే వీలుంది.
ఏమిటీ గ్రంథాలయం?
ప్రస్తుతం ఆన్‌లైన్ బోధనకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఎప్పటికీ విద్యార్థులకు అందుబాటులో ఉండేలా డిజిటల్ పాఠాలు తయారు చేయాలని హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహంతి సూచించారు. 6 నుంచి 10 తరగతులకు వీటిని రూపొందించి డిజిటల్ గ్రంథాలయంలో ఉంచుతారు. ప్రతి తరగతికి చెందిన ప్రతి సబ్జెక్టులోని పాఠాలన్నీ సిలబస్ ప్రకారం రికార్డు చేయించి నిక్షిప్తం చేశారు. విద్యార్థులు ఎక్కువసేపు చూడాలంటే ఇబ్బందిపడే అవకాశం ఉన్నందున ఒకే పాఠాన్ని నిడివి ప్రకారం చిన్న చిన్న భాగాలుగా విభజించి రికార్డు చేయించారు. 60 మంది ఉపాధ్యాయులు ఈ క్రతువులో భాగస్వామ్యమయ్యారు.