Polavaram Back Water Issue: పోలవరం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో గోదావరి నదికి ఇరువైపులా సంయుక్త సర్వేకు సీడబ్ల్యూసీ నిర్ణయించిందని తెలంగాణ అధికారులు తెలిపారు. పోలవరంపై కేంద్ర జలసంఘం ఛైర్మన్ ఆర్కే గుప్తా అధ్యక్షతన దిల్లీలో సాంకేతిక సమావేశం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలు, గత నెలలో కేంద్ర జలాశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు జరిగిన సమావేశంలో సీడబ్ల్యూసీ, పీపీఏ ఛైర్మన్లు, అధికారులతో పాటు తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ ఈఎన్సీలు, ఇంజినీర్లు పాల్గొన్నారు.
సమావేశంలో తెలంగాణ వాదనలు వినిపించిన రాష్ట్ర ఇంజినీర్లు.. పోలవరం బ్యాక్ వాటర్స్ ప్రభావంపై అధ్యయనం చేయాలని కోరారు. ఇటీవల గోదావరి వరదల్లో 103 గ్రామాలకు చెందిన 11 వేల కుటుంబాలు ముంపునకు గురయ్యాయని వివరించారు. పోలవరంలో పూర్తి స్థాయిలో నీరు నిల్వ చేస్తే ముంపు ముప్పు ఉందని పేర్కొన్నారు. ఏడు మండలాల్లోని 50 వేల ఎకరాలు నీట మునిగే ప్రమాదం ఉందని వివరించారు.