తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా కష్టకాలం... గర్భిణుల వైద్యానికీ కటకట! - హైదరాబాద్ కరోనా వార్తలు

కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆ ప్రభావం గర్భిణులకు అందించే సేవలపై పడింది. అత్యవసర సేవల కోసం మాత్రమే ఆసుపత్రికి రావాలని గర్భిణిలకు వైద్యులు సూచిస్తున్నారు. ప్రసవం కోసం వచ్చే గర్భిణుల్లో కరోనా లక్షణాలుంటే ఇతర ఆసుపత్రులు నిరాకరిస్తుండటంతో గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. దాదాపు 15-20 మంది కరోనా పాజిటివ్‌ ఉన్న గర్భిణులకు గాంధీ వైద్యులు ప్రసవం చేశారు.

pregnant
pregnant

By

Published : Aug 8, 2020, 6:56 AM IST

హైదరాబాద్‌లోని ప్రసూతి ఆసుపత్రులపై కరోనా ప్రభావం పడింది. రాష్ట్రం నలమూలల నుంచి గర్భిణులు నెలవారీ పరీక్షలతోపాటు ఇతర సమస్యలను ఇక్కడ చూపించుకొని వెళుతుంటారు. ముఖ్యంగా పాతబస్తీలోని పేట్లబుర్జు ఆసుపత్రికి ఎక్కువ తాకిడి ఉంటుంది. ఇక్కడ 462 పడకలు ఉన్నాయి.

కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆ ప్రభావం గర్భిణులకు అందించే సేవలపై పడింది. గతంలో నిత్యం 200 మంది వరకు ఓపీ ఉంటే ప్రస్తుతం 35-40 మందికి దాటడం లేదు. సుల్తాన్‌బజార్‌ ఆసుపత్రి వద్దా అదే పరిస్థితి. సేవలందించే పలువురు పీజీలు, వైద్యులు కొవిడ్‌ బారినపడటంతో సాధారణ ఓపీ సేవలను తగ్గించారు.

అత్యవసర సేవల కోసం మాత్రమే ఆసుపత్రికి రావాలని వైద్యులు సూచిస్తున్నారు. పేట్లబుర్జులో సేవలు తగ్గిపోవడంతో ఇటీవల పలువురు మహిళలు సుల్తాన్‌బజార్‌లోని ప్రసూతి ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు.

గైనిక్‌ వార్డుల్లో సేవలు బంద్‌..

పలు ప్రసూతి ఆసుపత్రుల్లో గైనిక్‌ సేవలు అటకెక్కాయి. పేట్లబుర్జుతోపాటు ఇతర చోట్ల ఈ వార్డులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రోగులు వైద్యులను సంప్రదిస్తున్నా సరే తీసుకోవటానికి నిరాకరిస్తున్నారు. గర్భసంచి, గర్భాశయ ముఖద్వార సమస్యలకు గతంలో హైదరాబాద్‌కు వచ్చి సేవలు పొందేవారు. పేట్లబుర్జు లేదంటే గాంధీ ఆసుపత్రిలో చికిత్సలు తీసుకొని తగ్గాక వెళ్లేవారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిని కేవలం కొవిడ్‌ సేవలకే కేటాయించిన విషయం తెలిసిందే. ఫలితంగా చాలామంది మహిళలకు ప్రసూతి చికిత్సలు అందక ఇబ్బందులు పడుతున్నారు. వేరేదారి లేక కొందరు అప్పులు చేసి ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ప్రతి ఆసుపత్రిలో కరోనా సేవలకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. వచ్చినవారిని ఉస్మానియా లేదా నిలోఫర్‌కు వెళ్లాలని సూచిస్తున్నారు.

లక్షణాలుంటే గాంధీకి..

ప్రసవం కోసం వచ్చే గర్భిణుల్లో కరోనా లక్షణాలుంటే ఇతర ఆసుపత్రులు నిరాకరిస్తుండటంతో గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. దాదాపు 15-20 మంది కరోనా పాజిటివ్‌ ఉన్న గర్భిణులకు గాంధీ వైద్యులు ప్రసవం చేశారు. ఎలాంటి లక్షణాలు లేకపోతే పేట్లబుర్జు, సుల్తాన్‌బజార్‌, నాంపల్లి, గోల్కొండ ఆసుపత్రుల్లో సేవలందిస్తున్నారు. లక్షణాలు ఉన్నా లేకున్నా గర్భిణులకు తప్పకుండా కరోనా పరీక్షలు చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి ప్రభావం కన్పించని వారిలోనూ పాజిటివ్‌ వస్తుండడమే ఇందుకు కారణం. అనవసరంగా ఇంటి నుంచి బయటకు రావద్దని, అధిక రక్తపోటు, మధుమేహం తదితర సమస్యలుంటేనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details