కరోనా మహమ్మారి మనుషులను భయపెట్టడమే కాకుండ లక్షల సంఖ్యలో ఉపాధిని దూరం చేస్తోంది. చిరు వ్యాపారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వేసవి కాలం కోసం చిరు వ్యాపారులు ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటారు. కానీ కరోనా గత ఏడాది నుంచి వారి ఆశలపై నీళ్లు చల్లుతోంది. ఈ కాలంలో పుచ్చకాయలకు మంచి డిమాండ్ ఉంటుందని... పది రూపాయలు సంపాదించు కొని జీవనోపాధి పొందవచ్చు అనుకునే వారికి కరోనా రూపంలో తీవ్ర నిరాశే ఎదురవుతోంది.
హైదరాబాద్ మింట్ కాంపౌడ్‌లోని రావి చెట్టు వద్ద ఎన్నో ఏళ్ల నుంచి ఓ కుటుంబం పుచ్చకాయల వ్యాపారం చేస్తోంది. ఇక్కడ ఏడాది పొడవునా పుచ్చకాయలు అమ్ముతూ జీవనోపాధి పొందుతున్నారు. కానీ గతేడాది నుంచి వ్యాపారం లేక.. పెట్టిన పెట్టుబడి రాక ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో వారు నెట్టుకొస్తున్నారు. వేసవి కాలం వచ్చిదంటే చాలు నగరంలోని జనాలంత ఇక్కడే వాలిపోతారు. కానీ కరోనా కారణంగా ఆఫీసులు మూసివేయడం, ఉద్యోగులు ఇంటి వద్దే పని చేయడం కారణంగా అటుగా వచ్చే వారి సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతోందని వ్యాపారం చేస్తున్న ఫీరోజ్‌ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు.