తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపు దిల్లీకి కాంగ్రెస్ నేతలు... సారథి మార్పునకు సంకేతాలు! - తెలంగాణ నేతలకు ఏఐసీసీ నుంచి పిలుపు

కాంగ్రెస్‌ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధిష్ఠానం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రాల వారీగా తాజా రాజకీయ పరిస్థితులను విశ్లేషిస్తోంది. ఈ నెల 16న పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతోపాటు ముఖ్యనాయకులతో సమీక్షించాలని నిర్ణయించింది. తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్ష ఎంపిక వ్యవహారం ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

రేపు దిల్లీలో కాంగ్రెస్ సమావేశం... తెలంగాణ నేతలకు పిలుపు!

By

Published : Nov 15, 2019, 7:09 AM IST

Updated : Nov 15, 2019, 7:35 AM IST

పీసీసీ అధ్యక్షుడి ఎంపిక జరిగేనా...?

కాంగ్రెస్ అధిష్ఠానం పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. మరోవైపు ఆయా రాష్ట్రాల్లో అధికార పార్టీల ప్రజా వ్యతిరేఖ విధానాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు ఆయా రాష్ట్రాల ముఖ్యనేతలతో సమీక్షలు నిర్వహించి తాజా రాజకీయ పరిస్థితులను తెలుసుకోవాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు.

16న అన్నిరాష్ట్రాల నేతలతో...

ఈ నెల 16న రాష్ట్రాల వ్యవహారాల ఇంఛార్జ్​లు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీనేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే దిల్లీకి రావాల్సిందిగా ఆయా నేతలకు అధిష్ఠానం వర్తమానం పంపింది. రాష్ట్రాల వారీగా పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, ఇంఛార్జ్​లతో ప్రత్యేకంగా మాట్లాడే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

పీసీసీ అధ్యక్షుని ఎంపికపై...

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఇప్పటికే తనను ఆ పదవి నుంచి తప్పించాలని అధిష్ఠానాన్ని కోరారు. తదుపరి అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయాలనేదానిపై ఈ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ పరిస్థితిని తెలుసుకోనున్నట్లు ఏఐసీసీ వర్గాల తెలిపాయి. ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలు కావడం, తెరాస వ్యవహరిస్తున్న తీరు, ఆ పార్టీ ఎత్తుగడలపై అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది.

దిల్లీ బాటలో నేతలు...

తెలంగాణలో పీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న వారిలో కొందరు ఇప్పటికే ఏఐసీసీ స్థాయిలో పావులు కదుపుతున్నారు. కొంతమంది నేతలు ఏఐసీసీకి తమ వివరాలు పంపించి... పరిశీలించాల్సిందిగా కోరారు. టీ పీసీసీ ఆశించే వారిలో మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతురావు, మాజీ మంత్రులు శ్రీధర్‌బాబు, షబ్బీర్‌ అలీ, జానారెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉన్నారు.

ఇవీ చూడండి : అదే వేదన... ఆగిన మరో ఆర్టీసీ కార్మికుడి గుండె

Last Updated : Nov 15, 2019, 7:35 AM IST

ABOUT THE AUTHOR

...view details