తెరాసపై కాంగ్రెస్ మండిపాటు రాష్ట్రంలో పుర ఎన్నికల సందర్భంగా తెరాస, రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేలా అధికార పార్టీ చర్యలున్నాయని ఆరోపించింది. మద్యం, డబ్బు, అధికార దుర్వినియోగం ద్వారా అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందించారు.
దొడ్డిదారిన కైవసం చేసుకుంటారా?
ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నికలో తెరాస హద్దులు దాటి వ్యవహరించిందని ధ్వజమెత్తారు. హస్తం గుర్తుతో గెలిచిన సభ్యులను కూడా ప్రలోభాలకు గురి చేసి... దొడ్డిదారిన మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు.
సిగ్గుపడాలి..
ప్రజలను అవమాన పరిచేలా పుర ఎన్నికలు జరిగాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికలు నిర్వహించిన తీరుకు మంత్రి కేటీఆర్‌తోపాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిగ్గుపడాలని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత ఎక్స్‌అఫిషియో ఓటరుగా ఓ ఎమ్మెల్సీ పేరును చేర్చడమేంటని ప్రశ్నించారు.
ప్రజల్లోకి తీసుకెళ్తాం..
2014 నుంచి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో తాను ఓటు వేశానని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు స్పష్టం చేశారు. ఇక్కడ ఓటు వేయడం తన హక్కని కేవీపీ పేర్కొన్నారు. తెరాస తీరుపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస తీరును ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలే.. బుద్ధిచెప్పేలా చేస్తామని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:దిల్లీ దంగల్: 'భాజపా.. ఆప్... ఓ ఆటోవాలా'