తెలంగాణ

telangana

ETV Bharat / state

సమీక్షలు, సమావేశాలు, ఆదేశాలు - పాలనపై తనదైన ముద్ర వేస్తున్న సీఎం రేవంత్​ రెడ్డి - cm Revanth reacts on DSP Nalini job

CM Revanth Reddy Making His Own Mark on Governance : సమీక్షలు, సమావేశాలు, ఆదేశాల జారీతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనపై తనదైన ముద్ర వేసేలా కసరత్తు చేస్తున్నారు. శాఖల వారీగా వివిధ అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు. వివరాలు అడుగుతూ నివేదికలు ఇవ్వాలని ఆదేశిస్తూ అవసరమైన ఆదేశాలను జారీ చేస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. నియామకాలు, ప్రజావాణి, పోలీసు, ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం తదితర అంశాలపై అధికారులతో చర్చించిన సీఎం అవసరమైన ఆదేశాలు జారీచేశారు.

CM Revanth Reddy review on Jobs Recruitment
CM Revanth Reddy review Meeting

By ETV Bharat Telangana Team

Published : Dec 16, 2023, 7:57 AM IST

రివ్యూ మీటింగ్​ల్లో సీఎం రేవంత్ మార్క్- అన్నిశాఖలపై అధికారులతో చర్చ

CM Revanth Reddy Making His Own Mark on Governance : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరుస సమీక్షలతో బిజీబీజీగా గడుపుతున్నారు. ప్రమాణ స్వీకారం రోజు నుంచి శాఖల వారీగా లోతుగా చర్చిస్తూ శాఖలపై పట్టు తెచ్చుకోవడంతో పాటు తగిన ఆదేశాలనూ జారీ చేస్తున్నారు. అధికారులు చెబుతున్న వివరాలపై ప్రశ్నలు అడుగుతూ మరింత సమాచారంతో నివేదికలు ఇవ్వాలని చెబుతున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్(Governor tamilisai ) ప్రసంగం ముగియగానే సచివాలయం వెళ్లిన రేవంత్‌, సాయంత్రం వరకు వివిధ శాఖలపై సమీక్షలు నిర్వహించారు. నియామకాలు, ప్రజావాణి, పోలీసు, ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.

సీఎం కాన్వాయ్​ వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగకూడదు - చర్యలకు ఆదేశించిన రేవంత్​ రెడ్డి

నెలలో రెండు రోజుల పాటు పట్టణ, గ్రామ సభలు నిర్వహించి ప్రజల సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. స్థానికంగానే సమస్యలు పరిష్కారమైతే హైదరాబాద్ వరకు వచ్చే అవసరం తగ్గుతుందని పేర్కొన్నారు. నిర్దేశిత గడువులో వేగంగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రజల ఫిర్యాదులు, వినతులను డిజిటలీకరణతో పాటు అవి ఏ దశలో ఉన్నాయో ప్రజలకు తెలియజేయాలన్నారు.

ప్రజావాణికి(Prajavani) అద్భుత స్పందన వస్తున్నందున ఫిర్యాదుల స్వీకరణకు టేబుళ్లను పెంచి, మంచి నీరు, ఇతర వసతులను కల్పించాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, శిక్షణలో ఉన్న ఐఏఎస్ అధికారుల సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. సచివాలయంలో మంత్రులను కలిసి సమస్యలు చెప్పుకునేందుకు నిర్దిష్ట సమయం కేటాయించి, ప్రత్యేక పాసులు ఇచ్చే అంశంపై అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం సూచించారు.

నేటితో ముగియనున్న శాసనసభ సమావేశాలు - గవర్నర్ ప్రసంగంపై ధన్యావాద తీర్మానంపై చర్చ

CM Revanth Reddy review on Jobs Recruitment :రాష్ట్రావిర్భావం నుంచి ఇప్పటి వరకు జరిగిన ఉద్యోగ నియామకాలపై నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నియామక ప్రక్రియలో లోటుపాట్లతో పాటు, వాటిని అధిగమించేందుకు అవసరమైన చర్యలు సూచిస్తూ నివేదికలు ఇవ్వాలని తెలిపారు. అత్యంత పారదర్శకంగా, అవకతవకల్లేకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీసు నియామక ప్రక్రియను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. పోలీసు, ఆర్టీసీ సిబ్బంది సంక్షేమంపైనా సీఎం సమీక్ష నిర్వహించారు.

వారి కోసం ప్రత్యేక పాఠశాలలు: ఏడెనిమిదేళ్లుగా నిలిచిపోయిన హోంగార్డుల నియామకాలను తక్షణం చేపట్టాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిర్వహణలో హోంగార్డుల సేవలను మరింత వినియోగించుకోవాలని సూచించారు. హోంగార్డుల ఆర్థిక, ఆరోగ్య అవసరాలు తీరేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీసులు, ఆర్టీసీలో ఉన్నతాధికారులు, కార్మికులు, కింది స్థాయి ఉద్యోగుల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఉత్తర, దక్షిణ తెలంగాణల్లో ఈ పాఠశాలలు ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

నళినికి అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇబ్బందేంటి? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన నళినికి అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని ముఖ్యమంత్రి అధికారులను అడిగారు. ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన చాలా మంది తిరిగి ఉద్యోగాల్లో చేరారని గుర్తు చేశారు. తెలంగాణ కోసం ఉన్నత ఉద్యోగాన్నే వదలిపెట్టిన నళిని విషయంలో అభ్యంతరాలు ఎందుకుండాలన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసిన నాయకులకు పదవులు వచ్చినప్పుడు, నళినికి ఎందుకు అన్యాయం జరగాలన్నారు. ఉద్యోగం చేసే ఆసక్తి ఉంటే నళినిని వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. ఒకవేళ నిబంధనలు అడ్డొస్తే, అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని సూచించారు.

ప్రజావాణికి ఊహించని స్పందన - అర కిలోమీటర్ వరకు బారులు తీరిన అర్జీదారులు

ABOUT THE AUTHOR

...view details