తెలంగాణ

telangana

ETV Bharat / state

డ్రగ్స్ నిర్మూలనకు ద్విముఖ వ్యూహం అనుసరించాలి: సీఎం - సీఎం కేసీఆర్​ సమీక్ష

CM KCR review on drug use control in Telangana
కేసీఆర్ సమీక్ష

By

Published : Jan 28, 2022, 1:24 PM IST

Updated : Jan 28, 2022, 7:50 PM IST

13:20 January 28

KCR review on drug use control: సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రగతిభవన్‌లో సదస్సు

KCR review on drug use control: వినూత్నరీతిలో ఆలోచించి బాధ్యతతో ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని సామాజిక ఉద్యమంగా మలచినప్పుడే రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణ సాధ్యమవుతుందని పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దన్నారు. ఏ పార్టీ కి చెందిన వారైనా సరే, నేరస్థులను కాపాడేందుకు ప్రజాప్రతినిధుల సిఫారసులను నిర్ద్వందంగా తిరస్కరించాలని పోలీసు అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వినియోగాన్ని కూకటివేళ్లతో పెకిలించాలనే లక్ష్యంతో ప్రగతిభవన్ వేదికగా ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర పోలీసు, ఎక్సైజ్ అధికారుల సదస్సు కొనసాగుతోంది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, జిల్లా స్థాయి వరకు పోలీసు, ఎక్సైజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సమాజమనే వేరుకు పట్టిన చీడ పురుగు

దేశవ్యాప్తంగా విస్తృతమవుతున్న గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వాడకాన్ని రాష్ట్రం కూడా సమూలంగా నిర్మూలించేందుకు పోలీస్ అధికారులు వినూత్నరీతిలో ఆలోచించాలని సీఎం సూచించారు. బాధ్యత కలిగిన మానవులుగా, బాధ్యతతో ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని సామాజిక ఉద్యమంగా మలచినప్పుడే మాదకద్రవ్యాల నియంత్రణ సాధ్యమవుతుందని పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అద్భుత శాంతిభద్రతల వల్లే అనతికాలంలోనే అత్యద్భుతంగా అభివృద్ధి పథాన దూసుకుపోతోందని ముఖ్యమంత్రి అన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ వాడకం ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న దుర్వ్యసనమని, సమాజమనే వేరుకు పట్టిన చీడ పురుగు వంటిదని అన్నారు. ప్రజలను డ్రగ్స్ కు వ్యతిరేకంగా చైతన్యం చేసేందుకు సృజనాత్మక కార్యక్రమాలను రూపొందించాలని సీఎం కేసీఆర్ అన్నారు.

వారికి అన్ని రకాల ప్రోత్సాహకాలు

వెయ్యి మంది సుశిక్షితులైన పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా నియమించుకుని అత్యాధునిక హంగులతో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్​ను ఏర్పాటు చేసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు. పలు అసాంఘిక శక్తులు, వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు ఏర్పాటు చేసుకున్న గ్రేహౌండ్స్ తదితర వ్యవస్థలు విజయవంతంగా పనిచేస్తున్నాయన్న కేసీఆర్... అదే తరహాలో నార్కోటిక్ డ్రగ్స్​ను నియంత్రించే విభాగం కూడా శక్తివంతంగా, తేజోవంతంగా పని చేయాలని చెప్పారు. అద్భుత పనితీరు కనపరిచే పోలీసు అధికారులకు అవార్డులు, రివార్డులతో పాటు ప్రత్యేక పదోన్నతులు, తదితర అన్ని రకాల ప్రోత్సాహకాలు అందించాలని అన్నారు. ఇందుకోసం కావాల్సిన నిధులను ప్రభుత్వం సమకూరుస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

ద్విముఖ వ్యూహం

డ్రగ్స్ నిర్మూలనకు ద్విముఖ వ్యూహం అనుసరించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. తొలి దశలో డ్రగ్స్‌కు బానిసలైనవారిని గుర్తించాలని సూచించారు. కుటుంబీకుల సహకారంతో డీ అడిక్ట్‌ చర్యలు చేపట్టాలన్నారు. డ్రగ్స్ నిర్మూలనలో సమాజం సహకారం తీసుకోవాలని చెప్పారు. సర్పంచులు, టీచర్లు, విద్యార్థులతో అవగాహన కల్పించాలని... ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా చైతన్యపరచాలని చెప్పారు. గ్రామంలో ఏ రైతు అయినా గంజాయి సాగు చేస్తే తెలపాలని పేర్కొన్నారు. సమాచారం ఇవ్వకపోతే గ్రామానికి రైతుబంధు రద్దు చేస్తామన్నారు.

మాఫియాపై విజృంభించాలి

'డ్రగ్స్‌ నెట్‌వర్క్‌ లింక్ గుర్తించి నిర్మూలించాలి. డ్రగ్స్ మాఫియా కట్టడికి పోలీసులు అధునాతన ఆయుధాలు వాడాలి. నిష్ణాతులకు బాధ్యతలు ఇచ్చి మాఫియాపై విజృంభించాలి. స్కాట్లాండ్‌ పోలీసుల విధానాలను పరిశీలించాలి. డ్రగ్స్ నేరస్థులను పట్టుకునేందుకు బృందాన్ని తీర్చిదిద్దాలి. డ్రగ్స్‌ నిర్మూలిస్తున్న దేశాల్లో అవసరమైతే పర్యటించాలి. డ్రగ్స్‌ కట్టడి చేసే రాష్ట్ర అధికారులతో శిక్షణ తీసుకోవాలి. డ్రగ్స్‌ నిర్మూలనకు ఎంత ఖర్చయినా ఫర్వాలేదు. ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తుంది. డ్రగ్స్ వంటి వ్యవస్థీకృత నేర వ్యవస్థల మూలాలు పట్టాలి.' - కేసీఆర్​, సీఎం

కేసులు వీగిపోకుండా...

డ్రగ్స్ నిర్మూలనలో రాష్ట్ర పోలీసులు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం ప్రాథమిక స్థాయిలోనే ఉందని... వినియోగం పెరిగితే అభివృద్ధిని పీల్చిపిప్పి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ వైపు యువత ఆకర్షితులవుతున్నట్టు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయని చెప్పారు. డ్రగ్స్‌ కట్టడికి అనుభవం ఉన్న అధికారులను ఎంచుకోవాలి... వ్యవస్థీకృత నేరాల కట్టడికి పీడీ చట్టం ప్రయోగించాలని స్పష్టం చేశారు. నేరస్థుల విచారణకు ఫోరెన్సిక్ ల్యాబ్స్‌ ఆధునికీకరించాలన్నారు. డ్రగ్స్ నేరస్థులను కోర్టు ముందు ప్రవేశపెట్టాలని... కేసులు వీగిపోకుండా నేరాల రుజువుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:

Last Updated : Jan 28, 2022, 7:50 PM IST

ABOUT THE AUTHOR

...view details