KCR request to the judiciary to protect democracy: హైదరాబాద్ గడ్డపైకి వచ్చి తమ ప్రభుత్వాన్ని కూలగొడతారా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై స్పందించిన కేసీఆర్.. మోదీ, తాను ఒకేసారి ప్రధాని, సీఎం అయ్యామన్నారు. ఈ విధానాలు దేశానికి శ్రేయస్కరం కాదు.. ఈ దుర్మార్గాలు ఆపాలని సూచించారు. ‘‘హైదరాబాద్‌గడ్డ మీదకొచ్చి మా ప్రభుత్వాన్నే కూలగొడతారా? 3/4 వంతు మెజార్టీ ఉన్న మా ప్రభుత్వాన్నే కూల్చాలని చూస్తారా? ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని దుర్మార్గంగా కూలిస్తే పార్టీలకతీతంగా అందరం కలిసి కొట్లాడాం. ఫోన్లు సీజ్ చేసిన వెంటనే వీళ్లు సాగించిన కుట్ర కోణమంతా బయటపడింది.'' అని వివరించారు.
''ఇదంతా ఒక్క రోజుది కాదు.. 2015 నుంచి దేశంలో ఏం జరిగిందో వీళ్ల చరిత్ర మొత్తం వచ్చింది. 3గంటల వీడియోలో కుట్రకోణమంతా బయటపడింది.. అదంతా హైకోర్టుకు సమర్పించాం. వీళ్లపై సేకరించిన సమాచారం 70 నుంచి 80వేల పేజీలు ఉన్నాయి. 3 గంటల వీడియో ఫుటేజీ మొత్తం హైకోర్టులో ఉంది.. ఎవరైనా అడిగి తీసుకోవచ్చు. ఇప్పుడు చూపించిన వీడియోను అన్ని రాష్ట్రాల సీఎంలు, రాజకీయ పార్టీలు, న్యాయమూర్తులు, మీడియా, దర్యాప్తు సంస్థలకు పంపుతున్నా..'' - కేసీఆర్, ముఖ్యమంత్రి
భారత న్యాయవ్యవస్థకు చేతులెత్తి ప్రార్థిస్తున్నా. దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అర్థిస్తున్నా. సుప్రీంకోర్టు సీజే, హైకోర్టు సీజే, న్యాయమూర్తులు కూడా వీడియోను పరిశీలించి.. ఇలాంటి వ్యవహారాలపై చర్యలు తీసుకోవాలి. అందరూ కలిసి యుద్ధం చేయాలి. దయచేసి మీడియా కూడా భాగస్వామ్యం కావాలని కోరుతున్నా. దేశాన్ని సర్వనాశనం చేస్తామంటే ఎవరూ క్షమించరు. దేశం కోసం చావాల్సి వస్తే చస్తాం. జరుగుతున్న దమనకాండను దేశ ప్రజలు, యువత ముక్తకంఠంతో ఖండించాలి. ఈ దేశం ప్రమాదంలో పడిన ప్రతిసారి కాపాడింది న్యాయవ్యవస్థే. అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీపై తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు తర్వాతే ఉద్యమం ప్రారంభమైంది. జయప్రకాశ్ నారాయణ్‌ను అందరూ గుర్తు చేసుకోవాలి. మోదీజీ.. మీరు, మీ పార్టీ చేస్తున్నది తప్పు. ఈ దుర్మార్గాలను ఆపండి. ఇలాంటి విధానాలు దేశానికి శ్రేయస్కరం కాదు’’ అని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.